పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష ఎంపీల సాధు వేషధారణపై వీహెచ్‌పీ ఆగ్రహం

పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష ఎంపీల సాధు వేషధారణపై వీహెచ్‌పీ ఆగ్రహం
పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు సాధువుల వేషధారణలో చేపట్టిన నిరసన సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, యావత్ హిందూ సమాజం మతపరమైన మనోభావాలను నేరుగా అవమానించడమేనని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్ర జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు సాధువుల వేషధారణలో చేసిన నిరసన అత్యంత దిగజారుడు చర్య అని ఆయన విమర్శించారు.
 
రావణుడు మోసం కోసం సాధువు వేషం ధరించినట్లుగానే, ఈ నాయకులు కూడా మతపరమైన ప్రతీకలను దుర్వినియోగం చేస్తూ హిందూ విశ్వాసాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల హిందూ వ్యతిరేక వైఖరి కొత్తది కాదని, శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు సనాతన విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. 
 
అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం పూర్తైన తర్వాత కలిగిన అసహనంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ సమాజం సహనంతో వ్యవహరిస్తుందని, అయితే తమ భాషా, రాజ్యాంగ పరిమితులను దాటే పరిస్థితిని తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు. ఈ నాయకుల్లో నిజంగా ధైర్యం ఉంటే, ఇతర మతాలకు చెందిన మత గురువులు లేదా మౌల్వీల వేషధారణలో వారి మత చిహ్నాలను ఎగతాళి చేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. 
 
అలా చేస్తే తీవ్ర నిరసనలు చెలరేగి, బయటకు రావడం కూడా కష్టమవుతుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో మతపరమైన ప్రతీకలను అవమానించిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ అత్యంత కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ చర్య మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలను వెంటనే అరికట్టకపోతే, దేశవ్యాప్తంగా సాధు-సంతులు మరియు హిందూ సమాజం ఆగ్రహం త్వరలోనే వీధుల్లో కనిపిస్తుందని డా. సురేంద్ర జైన్ హెచ్చరించారు.