పరారీలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మరణం, అరెస్టు లేదా జైలు శిక్ష వంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ, డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి రావాలని తాను నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు. “నన్ను చంపవచ్చు. నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను జైలుకు పంపవచ్చు,” అని 78 ఏళ్ల ఆమె ఏఎఫ్‌పీకి ఈమెయిల్ ద్వారా పంపిన సమాధానంలో తెలిపారు.
“నా గతి ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అయినా, నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నాను, ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు,” అని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు ఆమె 15 ఏళ్ల పాలనకు ముగింపు పలకడంతో, 2024 ఆగస్టులో హసీనా పదవీచ్యుతురాలయ్యారు. నిరసనకారులు ఆమె రాజభవనంపై దాడి చేయడంతో, ఆమె హెలికాప్టర్‌లో భారతదేశానికి పారిపోయారు.
ఆమె ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన అణచివేతలో 1,400 మంది వరకు మరణించారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. నవంబర్‌లో, ఢాకా కోర్టు ఆమెను మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి, ఆమె గైర్హాజరులో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె “చట్టం ముసుగులో ఉన్న రాజకీయ కక్ష” అని కొట్టిపారేశారు
భారతదేశంలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్న హసీనా, తన తిరిగి రాక నిర్ణయంపై ఎలాంటి బాహ్య ఒత్తిడి ప్రభావం లేదని నొక్కి చెప్పారు. “నేను భారతదేశంలో తగిన గౌరవంతో, హుందాగా ఉంటున్నానని చెప్పగలను,” అని ఆమె తెలిపేరు. “భారత అధికారులు నాతో అప్పగింత గురించి చర్చించలేదు. నా దేశానికి తిరిగి రావాలని నేనే స్వయంగా నిర్ణయించుకున్నాను,” అని ఆమె వెల్లడించారు.
ఆమెను అప్పగించాలని ఢాకా అధికారికంగా అభ్యర్థించగా, ఆ అభ్యర్థన పరిశీలనలో ఉందని భారత్ చెబుతోంది. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇరు పొరుగు దేశాల మధ్య సంబంధాలు స్థిరపడ్డాయి. ఒకవేళ హసీనా తిరిగి వస్తే, ఆమెపై ఉన్న అన్ని కేసులలో సరైన న్యాయ ప్రక్రియ జరిగేలా చూస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
హసీనా పరిపాలనపై రాజకీయ ప్రత్యర్థుల హత్యలు, ప్రతిపక్షాల అణచివేత, రిగ్గింగ్ ఎన్నికలతో సహా తీవ్రమైన దుర్వినియోగాల ఆరోపణలు ఉన్నాయి. హసీనా ఈ ఆరోపణలలో చాలావాటిని “రాజకీయంగా నిర్మితమైన ప్రచారాలు” అని తోసిపుచ్చారు. తన పదవీచ్యుతికి దారితీసిన నిరసనలను తన ప్రభుత్వం నిర్వహించిన తీరును ఆమె సమర్థించుకున్నారు.
“అత్యున్నత స్థాయి సహనాన్ని ప్రదర్శించి, విద్యార్థి ఉద్యమాన్ని శాంతియుత పరిష్కారం వైపు నడిపించడానికి ప్రయత్నించింది” అని ఆమె తెలిపారు. ఆమె ఆ తిరుగుబాటును “రహస్య ఆదేశాలు, వ్యవస్థీకృత హింస, ప్రచారం, ప్రభుత్వాన్ని కూలదోయాలనే లక్ష్యంతో నడిచిన ఒక ప్రణాళికాబద్ధమైన చర్య”గా అభివర్ణించారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ, క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.
ఈ సంక్షోభ సమయంలో తీసుకున్న నిర్ణయాల పట్ల పశ్చాత్తాపం ఉందో లేదో చెప్పడానికి కూడా ఆమె నిరాకరించారు. “ప్రభుత్వ నిర్ణయాలు ఒక్క వ్యక్తి తీసుకునేవి కావు. మొత్తం సంక్షోభం నుండి ఒకే ఒక్క క్షణాన్ని వేరుచేసి వాటిని నిజాయితీగా అంచనా వేయలేము,” అని ఆమె పేర్కొన్నారు.

More Stories
ప్రధాన్ నిష్క్రమణతో విద్యా రంగ సమస్యలు పరిష్కారమవుతాయా?
జంతర్ మంతర్ వద్ద కాల్పులు జరిగినట్లు రాహుల్ అబద్దాలు!
రష్యా `ఉగ్రవాదుల’ జాబితాలో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్