విద్యార్థి నాయకులు పోలీసులను ఎదుర్కోవాలి 

విద్యార్థి నాయకులు పోలీసులను ఎదుర్కోవాలి 
* సిపిఎం కార్యాలయంలోకి పోలీసుల రాకపై నడ్డా వ్యాఖ్యలతో రాజ్యసభలో గందరగోళం 
 
విద్యార్థి కార్యకర్తలపై పోలీసుల చర్యను సమర్థించుకుంటూ, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో తాను అరెస్టయిన విషయాన్ని సభలో నాయకుడు జె.పి. నడ్డా ప్రస్తావించడంతో బుధవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు సిపిఎం జాతీయ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. 
 
ఈ ఘటనను అసాధారణమైనదిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని నడ్డా తోసిపుచ్చారు. దీనిని ఒక సాధారణ శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించారు. సభలో పత్రాలు, నివేదికలు సమర్పించిన తర్వాత సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఈ ఘటనను ప్రస్తావించారు. విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు “ఒక జాతీయ రాజకీయ పార్టీ కార్యాలయంలోకి (సిపిఎం) చొరబడ్డారని” ఆయన ఆరోపించారు. 
 
జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొన్నందుకు ఘోష్‌ను పోలీసులు వెతుకుతున్నారని బ్రిట్టాస్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో వారిని ప్రశ్నించినప్పుడు, పోలీసులు 2020, 2021 నాటి కేసులను ప్రస్తావించారని ఆయన సభకు తెలిపారు. “ఇది పార్టీలకు అతీతమైన అంశం కాబట్టి ఢిల్లీ పోలీసుల చర్యతో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ మీకు ముందస్తు సమాచారం లేకుండా వారు అక్కడికి రావడం దిగ్భ్రాంతికరం. వారు ఏమి ఆశిస్తున్నారు – భయాన్ని సృష్టించడమా? అసలు ఏం జరిగిందో హోం మంత్రి మాకు చెప్పాలి,” అని బ్రిట్టాస్ అడిగారు. 
 
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే బ్రిట్టాస్‌కు మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. “అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళిన వారిని శిక్షించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారు ఎందుకు వెళ్లారు? వారు ఎవరు? వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఎవరు ఆదేశించారు? నేను అడుగుతున్నాను. అక్కడికి వెళ్ళమని వారిని ఎవరు అడిగారు? ఎవరు ఆదేశించారు?” అని నినాదాల మధ్య ఖర్గే ప్రశ్నించారు.
 
 ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తూ ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. బ్రిట్టాస్, ఖర్గేలకు సమాధానమిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగినప్పుడు పోలీసులు చర్య తీసుకోవాల్సి ఉంటుందని నడ్డా స్పష్టం చేశా. “నా మిత్రుడు జాన్ బ్రిట్టాస్ చెప్పినదానితో సంబంధం లేకుండా, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన చాలా సాధారణ శాంతిభద్రతల పరిస్థితి. నేను కూడా విద్యార్థి కార్యకర్తగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమర్జెన్సీ రోజుల్లో తరగతి గది నుండే నేను చాలాసార్లు అరెస్టు అయ్యాను,” అని ఆయన చెప్పారు. 
 
సాధారణ పోలీసు చర్యను సంచలనాత్మకం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని నడ్డా ఆరోపించారు. “ఇది ఒక సాధారణ పరిస్థితి. ఒక విద్యార్థి కార్యకర్త దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై పోలీసులు తదనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ కేసుల విషయంలో పోలీసులు తదనుగుణంగానే వ్యవహరించారు. వారు దీనిని సంచలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పోలీసులు చేపట్టే ఒక సాధారణ శాంతిభద్రతల చర్య,” అని ఆయన స్పష్టం చేశారు. 
 
ఆ తర్వాత ఆ బీజేపీ నాయకుడు ఎమర్జెన్సీ సమయంలో ఒక విద్యార్థి కార్యకర్తగా తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. “ఉద్యమించాలనుకునే ఏ విద్యార్థి కార్యకర్త అయినా దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. నేను కూడా దీనిని ఒక్కసారి కాదు, చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నన్ను తరగతి గది నుంచే ఒక్కసారి కాదు, రెండుసార్లు అరెస్టు చేశారు. కాబట్టి ఇది చాలా సాధారణ పరిస్థితి,” అని నడ్డా తెలిపారు. 
 
ఆయన వ్యాఖ్యలతో ప్రతిపక్షాల నిరసనను మరింత తీవ్రతరం చేశాయి, ఆ తర్వాత మాట్లాడిన వారి నినాదాలు కూడా వినిపించకుండా పోయాయి. ఆ తర్వాత సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.