మాతృత్వంలోని ప్రేరణను, సందేశాన్ని మరచిపోవడంతోనే అధోగతి

మాతృత్వంలోని ప్రేరణను, సందేశాన్ని మరచిపోవడంతోనే అధోగతి
* విశ్వమాంగల్య సభ సదస్సులో డా. మోహన్ భగవత్ 
 
మాతృత్వంలోని ప్రేరణను, సందేశాన్ని మరిచిపోవడం వల్ల సమాజం అధోగతి పాలైందని, దీనిని ఆసరాగా చేసుకొని విదేశీ శక్తులు మన దేశాన్ని లూటీ చేశారని, విజృంభించారన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్  హెచ్చరించారు. హైదరాబాద్ లో  విశ్వమాంగల్య సభ  ‘దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్’ సమావేశాల సందర్భంగా  “యుగానుకుల మాతృత్వం” అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  చివరి విదేశీ పాలకులైన బ్రిటీషర్లు ఆత్మ విస్మృతిని మరింత సుదృఢం చేసి వెళ్లిపోయారని తెలిపారు. 
 
అంతేకాకుండా మన దేశ ప్రాచీన అంశాలన్నీ వ్యర్థమైనవి అనేట్లుగా మన బుర్రలను తయారు చేశారని చెప్పారు. గత రెండు వేల సంవత్సరాల నుంచి మన పద్ధతులను, సంప్రదాయాలను విస్మరిస్తూ వస్తున్నామని అందరూ భావిస్తారని కానీ మహా భారత కాలం నుంచే ఆ విస్మృతి అనేది ప్రారంభమైందని ఆయన వివరించారు. అప్పటి నుంచే క్రమ క్రమంగా మన పద్ధతులను, ఆచారాలను, సంప్రదాయాలను విస్మరిస్తూ వస్తున్నామని చెప్పారు. 
 
ఆ తర్వాత ఆక్రమణలు ప్రారంభమయ్యాయని, అక్కడి నుంచి మన పద్ధతులపైనే మన మనస్సుల్లోనే, మనకే ద్వేషం పుట్టేంతలా విదేశీయులు తయారు చేశారని డా. భగవత్ తెలిపారు.విదేశీ పద్ధతులు, వ్యవహారాలే సరైనవి, మన సంప్రదాయాలు, మన వ్యవహారాలే తప్పుడు అన్న భావనను క్రమ క్రమంగా తెచ్చారని పేర్కొన్నారు. అసలైన సంప్రదాయాలు, పద్ధతులు కూడా మనకు తెలియకుండా పోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
ఈ అసంపూర్ణ దృష్టితో తప్పుడు భావనలు పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్నాయని, దీని కారణంగా అక్కడ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పారు. కొన్నింటిని అక్కడి నుంచి తీసుకున్నామని, అయితే ఆ సమస్యలకు వారి దగ్గర సమాధానాలు లేవని, మనకు కూడా లభించడం లేదని తెలిపారు. అయినా అవే ప్రమాణంగా, ఆ కథనాలే ప్రమాణంగా కొందరు ఇక్కడ కూడా నడుచుకుంటున్నారని పేర్కొన్నారు.
 
అసలు భారత్ లో లేని కథనాలను కూడా విదేశీయులు పుట్టించారని, వాటిని ఇక్కడ నడిపిస్తున్నారని పేర్కొంటూ ఉదాహరణకు పురుషులు శ్రేష్ఠులా? మహిళలు శ్రేష్ఠులా? అన్న వాదనను కూడా తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. పురుషుల పక్షం తీసుకునేవారు పురుషులు శ్రేష్ఠులని, మహిళల పక్షం వహించే వారు మహిళలే శ్రేష్ఠులని వాదిస్తుంటారని తెలిపారు. అయితే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న తర్క వాదాలు సమాజంలో వున్నాయని చెప్పారు. 
 
దీని తర్వాత మరి మహిళలే ఎక్కువైతే కుటుంబంలో బానిసగా ఎందుకు వుంటోంది? కుటుంబంలో బానిసగా వుంచే వివాహ బంధాన్ని ఎందుకు స్వీకరించింది? అంటూ మహిళలు ఏదైనా చేయగలరనే వాదాలు బయటికి తీస్తారని పేర్కొన్నారు. మహిళలు ఏదైనా చేయగలరన్న వాదన ఒట్టి భ్రమేనని, పురుషులు ఏదైనా చేయగలరన్న వాదనా కూడా అంతే భ్రమ అని డా. భగవత్ స్పష్టం చేశారు. మాతృత్వం అనేది అత్యంత సనాతనమైందని ప్రకృతికి సంబంధించిన ప్రవృత్తే మాతృత్వం అని అభివర్ణించారు. మాతృత్వం లేనిది సృష్టి నిర్మాణమే ముందుకు సాగదని స్పష్టం చేశారు.
 
విశ్వ మాంగల్య సభ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ జితేంద్రనాథ్ మహారాజ్, అఖిల భారత విశ్వ మాంగల్య సభ మార్గదర్శకులు ప్రశాంత్ జీ హోల్కర్,  జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి నలిని హవాడే , జాతీయ సంఘటన మంత్రి డాక్టర్ రుశాలి జోషి , సూరజ్ జీ దామోర్ విశ్వమాంగల్య సభ జాతీయ ఉపాధ్యక్షుడు , భగవతి జీ బాల్డ్వా – స్వాగత సమితి అధ్యక్షురాలు, సహ కార్యదర్శి  శృతి బొడ్డుపల్లి  తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర దక్షిణ భారత రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది విశ్వ మాంగల్య సభ కార్యకర్తలు పాల్గొన్నారు.