కొచ్చి కేంద్రంగా ఉన్న సిఎంఆర్ఎల్ (కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్)కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసులో కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ శశిధరన్ కర్తా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా టికి అక్రమంగా నిధులు చెల్లించినట్టు అంగీకరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను శనివారం న్యాయనిర్ణయాధికార సంస్థకు సమర్పించింది.
నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ తన నివేదికలో కోరింది. మాజీ సిఎం పినరయి విజయన్‌తో ఆమెకున్న వ్యక్తిగత సంబంధం వల్లనే ఈ చెల్లింపులు జరిగినట్టు మాజీ ఎండీ అంగీకరించారని పేర్కొంది. సిఎంఆర్ఎల్ అక్రమ లావాదేవీల్లో వీణా టి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి.
మాజీ సిఎం పినరపి విజయన్ కుమార్తె వీణాకు, సిఎంఆర్ఎల్కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. విజయన్ కుమార్తె వీణా టి ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు సిఎంఆర్ఎల్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే దాదాపు రూ. 2.78 కోట్ల మొత్తం ముందస్తు చెల్లింపులు జరిపిందని ఈడీ పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం సీఎంఆర్ఎల్ సంస్థాపకుడు, మాజీ ఎండీ అయిన శశిథరన్ కస్తా దాదాపు 15 సంవత్సరాల కాలంలో రూ. 182 కోట్లు నిధుల దుర్వినియోగం చేయడానికి ఒక రహస్య పథకాన్ని రూపొందించారని ఆరోపించింది.

More Stories
టాటా సన్స్ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
ఇకపై మెడికల్ స్టోర్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలపై కేసు