అనంతనాగ్ వద్ద ఉగ్ర‌వాదుల కాల్పుల్లో జ‌వాన్ మృతి

అనంతనాగ్ వద్ద ఉగ్ర‌వాదుల కాల్పుల్లో జ‌వాన్ మృతి
జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఒక జ‌వాన్ మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం, జ‌మ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-కోకెర్‌నాగ్ రోడ్డు మార్గంలో జ‌రిగింది. అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ (ఎస్ఓజీ)కు చెందిన ఇద్ద‌రు జ‌వాన్లు బుధ‌వారం ఉద‌యం అనంత్‌నాగ్-కోకెర్‌నాగ్ రోడ్డులో విధులు నిర్వ‌హిస్తున్నారు. 
ఈ స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన తీవ్ర‌వాదులు ఈ జ‌వాన్ల‌పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. స్పందించిన ఇత‌ర భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే వారిని చికిత్స కోసం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆ ఇద్ద‌రిలో తీవ్ర గాయాల కార‌ణంగా ఒక జ‌వాన్ అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. మ‌ర‌ణించిన జ‌వాన్‌ను ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. 
మ‌రో జ‌వాన్ ఆరోగ్య ప‌రిస్తితిపై ఇంకా ఎలాంటి స‌మాచారం లేదు. ప్రస్తుతానికి అత‌డికి చికిత్స కొన‌సాగుతోంది. ఉగ్ర‌వాదుల కాల్పుల నేప‌థ్యంలో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా గాలింపు, త‌నిఖీలు చేప‌ట్టారు.  ఉగ్ర‌వాదులు ఎక్క‌డ న‌క్కినా ప‌ట్టుకోవాల‌ని, పారిపోకుండా చూడాల‌ని గ‌ట్టి భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ప్రాంతాల్ని త‌మ అధీనంలోకి తీసుకున్నారు. 
ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన క్రమాన్ని నిర్ధారించడానికి, దాడికి బాధ్యులైన వారిని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు.గాలింపు చర్యలు కొనసాగుతుండగా, అధికారులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.
మ‌రోవైపు రాజౌరి సెక్టార్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఒక జ‌వాన్ ప్ర‌మాద‌వ‌శాత్తు ఎత్తైన ప్ర‌దేశం నుంచి కింద‌ప‌డి మ‌ర‌ణించాడు.  మృతుడిని సుఖ్‌ప్రీత్ సింగ్ (27)గా గుర్తించారు. అత‌డు సుంద‌ర్‌బ‌ని సెక్టార్‌లోని మ‌హ‌దేవ్ పోస్టు వ‌ద్ద ఎత్తైన ప్ర‌దేశంలో డ్యూటీ చేస్తున్నాడు. అయితే, అక్క‌డ ప‌ట్టు కోల్పోయి జారిపోవ‌డం వ‌ల్ల కింద ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. అత‌డి మృత‌దేహాన్ని స్వాగ్రామానికి త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.