తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు

తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును ఈ నెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయిలో సర్వే నెమ్మదిగా సాగుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఆగస్ట్ 3వ తేదీ వరకు ఇంటింటి సర్వే, ఓటరు వివరాల సేకరణ, ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను కొనసాగిస్తారు. 
ఆ తర్వాత ఆగస్టు 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.  ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కొత్తగా ఓటు నమోదు, పేరు సవరణ, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువు కల్పించారు. ఈ దరఖాస్తులపై విచారణ, నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక అక్టోబర్ 12వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 99.99శాతం పూర్తయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంకా కొన్ని ఫారాలు ఇవ్వాల్సి ఉండగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతటా ఫారాల పంపిణీ పూర్తయిందని సీఈవో కార్యాలయం వెల్లడించింది. అయితే ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపి తిరిగి ఇచ్చే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 శాతం ఓటర్లే ఫారాలు నింపి ఇచ్చారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు కూడా అందలేదని, అందుకే ఎస్ఐఆర్ గడువు పెంచాలని చేసిన విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కొత్త షెడ్యూల్‌ను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.  అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసినట్లు . ఎస్ఐఆర్ ప్రక్రియలో అవసరమైన ఫారాలు సమర్పించకపోతే లేదా వివరాలు నమోదు చేయకపోతే ఓటరు జాబితాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అర్హులైన ప్రతి ఓటరు నిర్ణీత గడువులోపు వివరాలను ధృవీకరించి అవసరమైన ఫారాలను సమర్పించాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.