రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోషించిన దౌత్యపరమైన పాత్ర గురించి పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లావ్ టెయోఫిల్ బార్టోస్జెవ్స్కీ ఒక కీలక వ్యాఖ్య చేశారు.2022 చివరలో ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నివారించడంలో భారత ప్రధాని కీలక పాత్ర పోషించారని ఆయన వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవించే కొద్దిమంది ప్రపంచ నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని తెలిపారు. 2022 చివరిలో జరిగిన పరిణామాలను పొలాండ్ మంత్రి ప్రస్తావిస్తూ యుద్ధ సమయంలో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించవద్దని రష్యాను ఒప్పించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.
రష్యాతో భారత్‌కు ఉన్న దశాబ్దాల నాటి సంబంధం న్యూఢిల్లీకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోందని, శాంతిని నెలకొల్పే ప్రయత్నాలలో దీనిని ఒక కీలక శక్తిగా నిలుపుతోందని బార్టోస్జెవ్‌స్కీ పేర్కొన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు. అలీన విధానం అనుసరించిన కాలం నుంచి భారతదేశానికి రష్యాతో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో కూడా చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ వాస్తవానికి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మాస్కోతో సంప్రదింపులు రోజురోజుకు కష్టతరం అవుతున్న తరుణంలో, రష్యా అధ్యక్షుడిని ప్రభావితం చేయగల కొద్దిమంది నాయకులలో ప్రధాని మోదీ కూడా ఒకరని పోలిష్ మంత్రి తెలిపారు. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు. ఈ సంఘర్షణను ఆపడానికి భారత్ స్పష్టంగా చేయగలిగే సహాయం ఇదే’’ బార్టోస్జెవ్‌స్కీ అభిప్రాయపడ్డారు.
రష్యా తనను శత్రువులుగా భావించే దేశాల నుంచి వచ్చే విజ్ఞప్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, భారత్‌తో పాటు చైనా వాణిని కూడా మాస్కో గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ ఇష్టం లేదని భారత్, చైనా వంటి దేశాలూ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారతదేశం తీసుకున్న వైఖరిని బార్టోజెవ్‌స్కీ ప్రశంసించారు. న్యూఢిల్లీ విధానం సముచితంగా ఉందని చెప్పారు.ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం, చమురు, సహజ వాయువుల నిరంతర సరఫరాపై ఎక్కువగా ఆధారపడి ఉందని, అందువల్ల ప్రాంతీయ స్థిరత్వం ఒక కీలకమైన ఆందోళనగా మారిందని ఆయన పేర్కొన్నారు.
పోలిష్ మంత్రి ప్రకారం, వార్సా కూడా ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తూ, ఈ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం నిరంతరం వాదిస్తోంది. భారత్‌తో చమురు విభేదాలు సద్దుమణిగాయని పేర్కొంటూ రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకోవడంపై గతంలో ఉన్న విభేదాలను న్యూఢిల్లీ, వార్సా అధిగమించాయని పోలాండ్ మంత్రి స్పష్టం చేశారు.
రష్యా ఆర్థిక వ్యవస్థకు భారత్ పరోక్షంగా మద్దతు ఇస్తోందంటూ గతంలో తాము చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
More Stories
ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్న శరద్ పవార్
మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి
ఈ20 ఇంజన్లను దెబ్బతీస్తుందనడానికి ఆధారాలు లేవు