ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన క్షిపణుల తయారీలో ఇకపై ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్, దేశ సాయుధ బలగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు రక్షణ ఎగుమతులు కూడా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళానికి అవసరమైన పరికరాల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించింది. ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా భావించే క్షిపణుల తయారీలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కేంద్రం యోచిస్తోంది.
దీంతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)పై ఉన్న ఉత్పత్తి భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత సాయుధ బలగాలతో పాటు మిత్రదేశాల నుంచి కూడా స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు భారీ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆ అవసరాలన్నింటినీ ఒక్క బీడీఎల్ మాత్రమే తీర్చడం కష్టంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలను కూడా తయారీ ప్రక్రియలో భాగం చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మొదటి దశలో గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర మార్క్-2 క్షిపణుల తయారీకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఐకామ్, అదానీ గ్రూప్, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
అస్త్ర మార్క్-2 క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇది దృశ్య పరిధికి అవతల ఉన్న లక్ష్యాలను కూడా సమర్థంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చైనా అభివృద్ధి చేసి పాకిస్థాన్‌కు అందించిన పీఎల్-15ఈ దీర్ఘశ్రేణి క్షిపణికి దీటుగా ఈ క్షిపణిని రూపొందించారు. భారత వైమానిక దళంలోని తేజస్ మార్క్-1ఏ, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణిని అనుసంధానించనున్నారు.
భారత్ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిపై విదేశీ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇండోనేసియా ఇప్పటికే ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో రక్షణ ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్త్ర మార్క్-2తో ప్రారంభమయ్యే ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తర్వాత మరింత విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.
రెండో దశలో ప్రళయ్ వంటి శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణుల తయారీలో కూడా ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. డబుల్ ఇంజిన్ వ్యవస్థతో పనిచేసే ఈ క్షిపణి ధ్వని వేగానికి ఆరు రెట్లు అధిక వేగంతో ప్రయాణించి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. భవిష్యత్తులో భారత సైన్యానికి ఇది కీలక ఆయుధంగా మారనుంది.

More Stories
అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు
రామ మందిర్ సీఈఓ ట్రస్ట్ కు జవాబుదారీ!
రష్యా సైనికులకు చైనా రహస్యంగా శిక్షణ?