ఈ యుద్ధనౌకలోని 75 శాతానికి పైగా భాగాలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు. భారతదేశ రూపకల్పన సామర్థ్యం, తయారీ నైపుణ్యం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం, అలాగే దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ శక్తికి ఇది సజీవ నిదర్శనమని మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని నిర్మించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. సాంకేతికంగా ఇంకా బలంగా ఉండేలా నూతన ఆవిష్కరణలకు ప్రణాళికలు వేశారని, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమ్ములపొదిలో మరో అస్త్రం చేరిందని, శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోవడం దీని ప్రత్యేకత అని రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు.
రక్షణ రంగం మరింత బలోపేతం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని, అత్యాధునిక, సరికొత్త యుద్ధ నౌకలను నావికాదళం సమకూర్చుకుంటుందని పేర్కొన్నారు. సముద్ర భద్రత, ఆర్థిక భద్రత అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని రక్షణ మంత్రి వెల్లడించారు. జాతీయ భద్రతకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి సముద్ర మార్గాలు ఎంతో కీలకమని చెప్పారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను వివరిస్తూ ఈ ప్రాంతంలోని అందరి భద్రత, వృద్ధిని కాంక్షించే ‘సాగర్’ దార్శనికతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్ ఒక నికర భద్రతా ప్రదాత. ప్రాంతీయ భద్రత, అభివృద్ధిని నిర్ధారించడానికి కట్టుబడిన ఒక నమ్మకమైన భాగస్వామి’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు (హెచ్‌ఏడీఆర్), సముద్రపు దొంగల నిరోధక మిషన్లు, సంక్షోభ ప్రాంతాల నుంచి భారతీయ, విదేశీ పౌరులను సురక్షితంగా తరలించడంలో నావికాదళం ఈ నిబద్ధతను నిరంతరం నిరూపిస్తోందని ప్రశంసించారు

More Stories
మాజీ హోంమంత్రికి సీట్ నిరాకరణ.. ఎంపీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు
భారత్- న్యూజిలాండ్ ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి