ఇథనాల్ 20 పెట్రోల్ కారణంగా కొన్ని వాహనాల్లో మైలేజీ 3 నుంచి 5 శాతం తగ్గొచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, దీని ప్రభావం కంటే ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని వివరించింది. ఈ 20 పెట్రోల్‌తో మంచి ఇంజిన్ పనితీరు, మెరుగైన పికప్, తక్కువ కర్బన ఉద్గారాల విడుదల వంటి ఉపయోగాలు ఉన్నాయని తెలిపింది. ఇది అధిక నాణ్యత, సమర్థవంతమైన ఇంధనం అని పేర్కొంది.
అనేక సంవత్సరాలుగా శాస్త్రీయ పరీక్షల తర్వాతే దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే కార్యక్రమంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ‘సందేహాలు- సమాధానాలు’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను శుక్రవారం విడుదల చేసింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియను చాలా వేగంగా అమలు చేశారన్న ఆందోళనలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.
సైంటిఫిక్ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీదారులతో సంప్రదింపులు, దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెంపు చేపట్టిన అనంతరమే దశలవారీగా ఈ20 పెట్రోల్ వినియోగాన్ని తీసుకొచ్చినట్లు వివరించింది. భారత్‌లో ఈ కార్యక్రమం 2001లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైందని, 2006 నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 శాతం బ్లెండింగ్ అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు 1.5 శాతం ఇథనాల్ బ్లెండింగ్ విధానమే అమల్లో ఉందని చెప్పింది. 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టి ఉత్పత్తిని ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపింది. ప్రత్యేక ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ, లాజిస్టిక్స్‌లో పెట్టుబడుల తర్వాత భారత్ 2022లోనే నిర్దేశిత సమయానికి ముందే 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించిందని చెప్పింది.
2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 20 శాతం మిశ్రమాన్ని చేరుకుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాత వాహనాలు పాడవుతాయన్న ఆందోళనలపైనా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా ఈ20ను పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ముందు ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, మెటీరియల్ అనుకూలత, తుప్పు నిరోధకత, పికప్, ఉద్గారాలపై విస్తృతమైన పరీక్షలు చేశామని చెప్పింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ20 వల్ల వాహనంలో తుప్పు, అసాధారణ అరుగుదల లేదా భాగాల జీవితకాలం దెబ్బతినడం వంటి సమస్యలను సర్వీస్ చేసిన వాహనాల్లో తాము ఎదుర్కోలేదని మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్‌తో సహా ఆటోమొబైల్ తయారీదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రస్తావించింది.
పెట్రోల్ పంపులు శుద్ధమైన పెట్రోల్, ఈ10, ఈ20 వంటి ఇంధన గ్రేడ్‌లను అందించాలన్న డిమాండ్లపైనా కేంద్రం స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో సప్లయ్ చైన్‌లు నిర్వహించడం వల్ల లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయని వివరించింది. దీని వల్ల దేశంలో ఉన్న లక్షకుపైగా రిటైల్ ఔట్‌లెట్లకు ఇంధన పంపిణీ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుందని పేర్కొంది.

More Stories
డ్రగ్స్ కేసులో ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడి సోదరుడ్ని ప్రశ్నించిన పోలీసులు
హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ సరఫరాపై ప్రభావం
4 లక్షల డాలర్ల దోపిడీలో ఐపీఎస్ అధికారిపై ఎఫ్‌బీఐ అభియోగాలు