సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే తుది ఓటరు జాబితాలో పేరు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి రెండు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తామని తెలిపారు. రెండు ఎన్యూమరేషన్ పత్రాలు నింపి, ఒకటి బిఎల్‌ఒకు ఇవ్వాలని, రెండో ఎన్యుమరేషన్ పత్రాన్ని ఓటర్లు తమ వద్దే ఉంచుకోవాలని ఆయన చెప్పారు.
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) చేపడుతున్నామని చెబుతూ రాష్ట్రంలో జూన్ 25 నుంచి జులై 24 వరకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు అందిస్తున్నామని వెల్లడించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫామ్ -6 ద్వారా ఆగస్టు, సెప్టెంబర్‌లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం రాకపోతే ఆగస్టులో ఫాం 6, 8 ఇస్తారని తెలిపారు. ఒకవేళ ఓటరు కొత్త ప్రాంతానికి మారితే, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత వారు తమ చిరునామాను మార్చుకోవచ్చని తెలిపారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఎన్యుమరేషన్ పత్రాల జిల్లాల్లో బాగానే ఉన్నా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పంపిణీ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారం రాకపోతే బిఎల్‌ఒలను సంప్రదించాలని సూచించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌ల ప్రకారం పంపిణీ చేయడంలో కొన్ని ఇబ్బందుల్ల వల్ల పత్రాల పంపిణీలో ఆలస్యం అవుతోందని చెప్పారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ముగిసిందని, ప్రస్తుతం తెలంగాణతో కలిపి 17 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రోహింగ్యాలకు ఓటు హక్కు ఉన్నట్లు తేలితే ఇఆర్‌ఒలు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం ఓట్లను తొలగిస్తారని తెలిపారు. సర్ గడువు పొడిగింపు తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఎవరి ఓటును అధికారులు కావాలని తొలగించరు అని సిఇఒ సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటు తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదని వెల్లడించారు. ఓటు తొలగించే ముందు సంబంధిత ఓటరుకు సమాచారం ఇచ్చి, వారి వివరణ తీసుకున్న తర్వాతనే ఓటు తొలగిస్తామని తెలిపారు. ఓటు తొలగించిన తర్వాత కూడా కలెక్టర్‌కు, సిఇఒకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో తప్పుడు వివరాలు ఉన్న ఓటర్లు అనామాలీస్ 89 లక్షలు ఇసిఐ గుర్తించిందని, త్వరలో అక్షర దోషాలు ఉన్న అనామాలీస్ ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. నోటీసులు అందిన ఓటర్లు అక్షర దోషాలకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలు సంబంధిత అధికారులకు చూపిస్తే సరిపోతుందని తెలిపారు.
ఆన్‌లైన్‌లోనూ ఎన్యుమరేషన్ ఫారం నింపొచ్చు
ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపవచ్చని సిఇఒ చెప్పారు. https://voters.eci.gov.in పోర్టల్‌లో,ఇసి వెబ్‌సైట్‌లో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించవచ్చని తెలిపారు. ఓటర్ సవరణ నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జరిగేది స్పెషల్ సమ్మరి రివిజన్ అని, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని వివరించారు.
రాష్ట్రంలో జూన్ 10వ తేదీ నాటికి 3 కోట్ల 38 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని సిఇఒ అన్నారు. అందులో మృతి చెందిన, వలస వెళ్లిన వాళ్ల ఓట్లను తొలగించడానికే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. ఒక ఓటరుకు ఒకే ఓటు ఉండాలని, రెండుచోట్ల ఉంటే చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు ఒకే చోట ఎన్యుమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. రెండు చోట్ల ఫారాలు ఇస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించారు.

More Stories
జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి
కాబోయే ట్రస్టీలు రామ్‌టెక్ శ్రీరాముని భక్తులమని ప్రకటించుకోవాలి
ఈ ఏడాది బోనాల జాతర జులై 16 నుండి ఆగస్టు 13 వరకు