తెలంగాణలో 3 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో 3 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని జిల్లాలకు విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా మూడు కీలక విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కదులుతున్నాయి. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగా, ఆదిలాబాద్ విమానాశ్రయానికి సైతం కీలక అనుమతులు వచ్చాయి. 
 
ఇదే తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే ఏవియేషన్ రంగంలో తెలంగాణ సరికొత్త మైలురాయిని అందుకోనుంది. వరంగల్ నగర సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు చారిత్రక నేపథ్యం ఉంది. దీనిని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లోనే నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వమే ఇది దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందించింది. 
కాలక్రమేణా నిలిచిపోయిన ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. త్వరలో ప్రారంభోత్సవంకు సిద్ధమవుతున్నది.  ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధిని రక్షణ, పౌర విమానయాన శాఖలు సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. మొత్తం 1,500  ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. 

ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్. మిలిటరీ అవసరాల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర విమానయాన శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇక్కడ విమాన ప్రయాణ సేవలతో పాటు పైలట్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరాయి.

సింగరేణి పారిశ్రామిక ప్రాంతం, ఏజెన్సీ జోన్ కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు కోసం ఇప్పటికే రెవెన్యూ అధికారులు స్థలాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు.  దీనికి సంబంధించిన సమగ్ర సాంకేతిక, భూసేకరణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఇక్కడ కూడా పనులు ప్రారంభమవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  ఈ మూడు ప్రాంతీయ విమానాశ్రయాలు రానున్న కాలంలో అందుబాటులోకి వస్తే.. కేవలం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పైనే కాకుండా, జిల్లాల నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరిగి తెలంగాణ పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధి ఊపందుకోనుంది.