నితిన్ నబిన్ పర్యటనతో రేవంత్ రెడ్డిలో భయాందోళనలు  

నితిన్ నబిన్ పర్యటనతో రేవంత్ రెడ్డిలో భయాందోళనలు  
బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన విజయవంతం కావడం చూసి అధికార కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో భయాందోళన మొదలైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుల పర్యటనకు తెలంగాణ ప్రజల నుండి, పార్టీ శ్రేణుల నుండి లభించిన అపూర్వ స్వాగతం, ఆశీర్వాదాలు చూసి ముఖ్యమంత్రి ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. 
 
గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఎన్నికల వ్యూహంతో ఓడించిన ఘనత కలిగిన నితిన్ నబిన్ పై రేవంత్ రెడ్డి అహంకారంతో, రాజకీయ దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ బలహీనమైన ముఖ్యమంత్రి కాబట్టే ఓడిపోయిందని, తనను ఓడించడం ఎవరితరం కాదంటూ రేవంత్ రెడ్డి  చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతాభావాన్ని, భయాన్ని స్పష్టం చేస్తున్నాయని స్పష్టం చేశారు. 
 
నితిన్ నబిన్ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ నినాదానికి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని, ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లను బిజెపి ఎండగట్టడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదని విమర్శించారు.

గడిచిన కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏం చేసింది, అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఎంత మోసం చేసింది అనే అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని రాంచందర్ గారు స్పష్టం చేశారు. దమ్ముంటే సచివాలయం గేటు ముందు రెండు కుర్చీలు వేసుకుని అభివృద్ధిపై చర్చిద్దామని, వాన పడితే గొడుగులు కూడా తామే తెస్తామని సవాల్ విసిరారు. 

 
బిజెపి నిర్వహించిన సంస్థాగత సమావేశాలకు వచ్చిన అపూర్వ స్పందనను చూసి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 10,000 బూత్‌లకు గాను 10,000 మంది బూత్ ప్రెసిడెంట్లు, వరంగల్‌లో 5,000 మంది, పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి 3,000 మంది జిల్లా కార్యకర్తలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంకు ఆశించిన దానికంటే ఎక్కువగా 450 మంది ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. 
 
ఇవి కేవలం పార్టీ అంతర్గత సంస్థాగత సమావేశాలేనని, వీటికే రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగిరిపోతే ఇక రేపు రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలు చూస్తే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి కూడా బిజెపి సభల సక్సెస్‌ను చూడలేకపోతున్నారని ధ్వజమెత్తారు.  కావాలంటే ఆయా మీటింగ్‌ల యూట్యూబ్ లింకులు రేవంత్ రెడ్డి కు పంపుతామని, ప్రశాంతంగా పడుకుని చూసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆధారాలు లేని వాపోహాలు పక్కనపెట్టి, చేతనైతే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.