అయోధ్య రామాలయంకు సమర్పించిన కానుకలను చోరీ చేసిన కేసులో సీబీఐ నేతృత్వంలో సత్వర విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడుతామని, ఇప్పుడేం ఆకాశం ఊడి పడడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇద్దరు అడ్వకేట్లు పిల్ దాఖలు చేశారు. రామ మందిరంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సీబీఐతో పాటు ఇతర ఏజెన్సీల నేతృత్వంలో దర్యాప్తు జరగాలని ఆ పిటీషన్లో కోరారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు విశ్వసనీయంగా లేనట్లు ఆ అడ్వకేట్లు తమ పిటీషన్లో పేర్కొన్నారు.
చోరీకి సంబంధించిన కీలకమైన ఆధారాలను సరైన రీతిలో కాపాడడం లేదని ఆ పిటీషన్లో ఆరోపించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. అత్యవసర విచారణ అవసరం లేదని, జూలై 12 నుంచి 17 మధ్య ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆలయ ట్రస్టుకు అవసరమైన పర్యవేక్షణ, ఆడిట్, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్లో కోరారు. అందువల్ల తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

More Stories
అమర్నాథ్ ప్రధమ పూజతో ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్
అస్సాంలో ఉల్ఫా ఉగ్రదాడి భగ్నం.. ఇద్దరు పట్టివేత
మొహర్రం ఊరేగింపులో 30,000 మందిని చంపే కుట్ర?