* సీషెల్స్ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ అందుకున్న మోదీ
హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్) ఒక ‘ఉమ్మడి గృహం’గా మిగిలి ఉందని, దాని ‘భద్రత, సుస్థిరత, శ్రేయస్సు’ ప్రతి దేశం బాధ్యత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అదే సమయంలో, భారత్-సెయిషెల్స్ సంబంధాలకు ప్రజల మధ్య సంబంధాలే అతిపెద్ద బలం అని ఆయన నొక్కి చెప్పారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం సెయిషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలను, ఆర్థిక బంధాలను మరింత పెంచుకోవడానికి మార్గం సుగమం చేసే హిందూ మహాసముద్రాన్ని భారతదేశం కోరుకుంటోందని చెప్పారు.
హిందూ మహాసముద్రం అవకాశాల సముద్రంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. “హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని మేము విశ్వసిస్తున్నాము. దాని భద్రత, సుస్థిరత,యు శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత. ఇదే మా మహాసాగర్ కార్యక్రమం ప్రధాన ఇతివృత్తం. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ రోజు మేము చర్చలు జరిపాము. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడంలో సహాయపడే అనుసంధానాన్ని మెరుగుపరచడానికి పనులు జరుగుతాయి,” అని ఆయన తెలిపారు.
భారత్, సీషెల్స్ మధ్య అనుసంధానాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని, ఇది యావత్ తూర్పు ఆఫ్రికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో న్యూఢిల్లీకి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దూరాన్ని తగ్గించడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తూర్పు ఆఫ్రికా దేశమైన సీషెల్స్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అమలు కోసం భారత్, సీషెల్స్ ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేయడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని ప్రధానమంత్రి తెలిపారు.
ప్రధాని మోదీ సీషెల్స్ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సుస్థిర వృద్ధి, హరిత దార్శనికత కోసం ఆయన చేసిన కృషికి గాను, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి సీషెల్స్ ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ఈ బిరుదును ఆయనకు ప్రదానం చేశారు. ప్రధాని మోదీ అందుకున్న 34వ అంతర్జాతీయ పురస్కారం ఇది. ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ బిరుదుతో గౌరవించబడటం తనకు, భారతీయులకు గర్వకారణమని, ఆనందకరమని చెప్పారు.
“వాతావరణ మార్పుల సవాలుతో పోరాడుతూ, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలన్నింటికీ ఈ గౌరవాన్ని వినయపూర్వకంగా అంకితం చేస్తున్నాను,” అని ప్రధాని మోదీ తెలిపారు. “సెయిషెల్స్ తన స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ చారిత్రాత్మక తరుణంలో, అలాగే భారత్-సెయిషెల్స్ మధ్య దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్న తరుణంలో నా పర్యటన జరుగుతోంది. ఈ 50 ఏళ్ల కాలంలో, మనం స్నేహాన్ని విశ్వాసంగా, విశ్వాసాన్ని సహకారంగా, సహకారాన్ని ప్రజా సంక్షేమంగా మార్చుకున్నాం,” అని ఆయన జోడించారు.
కాగా, ప్రధాని మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం, ఇరు దేశాలు కీలక రంగాలలో సాధించిన పురోగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని, ఇది ద్వైపాక్షిక ప్రయాణంలో ఒక మైలురాయి అని హెర్మిని తెలిపారు. భారతదేశం సహాయంతో ప్రారంభమైన వృత్తి, సాంకేతిక విద్యా కేంద్రం గురించి కూడా హెర్మిని మాట్లాడుతూ, ఇది యువతకు ప్రపంచ స్థాయి వృత్తి శిక్షణను అందించి, దేశ సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు.
ప్రధాని మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారాన్ని ప్రదానం చేయడంపై ఆయన మాట్లాడుతూ, సుస్థిర వృద్ధికి భారత నాయకుడు చేసిన కృషికి, హరిత దార్శనికతకు ఆయన అందించిన సేవలకు సీషెల్స్ ‘అత్యున్నత గౌరవానికి, గుర్తింపునకు’ ఇది ఒక ప్రతీక అని పేర్కొన్నారు.

More Stories
నగరాల్లో ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలి
విరాళాల చోరీ కేసులో నిందితుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు
ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకర వాఖ్యలు.. ఖర్గేకు కోర్టు నోటీసు