నగరాల్లో ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలి

నగరాల్లో ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలి

నగర కాలుష్యం తగ్గేందుకు అనేక చర్యలు చేపట్టామని చెబుతూ నగరాల్లో ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడుతూ నగరాల్లో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగం తగ్గించాలని, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. 

కేంద్ర పథకాల ప్రయోజనాలను పేద ప్రజలు అందిపుచ్చుకోవాలని, మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయంగా విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని మోదీ  సూచించారు.  పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని చెప్పారు. అసోంలో హర్గీలా పక్షులను అశుభసూచకంగా భావిస్తున్నారని చెబుతూ ఇది సరికాదు అని ప్రధాని హితవు చెప్పారు. 
 
నాగాలాండ్ లోని చిన్నారుల ఫుట్ బాల్ లీగ్ ను ప్రస్తావించారు. 5నుంచి 12 ఏళ్ల పిల్లలు ఈ ఫుట్ బాల్ లీగ్ లో ఆడుతున్నారని, నాగాలాండ్ చిన్నారులు దేశంలోని మిగతా ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. యువత .క్రీడాలను కెరీర్ గా ఎంచుకునే కష్టపడాలని, యువత క్రీడలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. 
 
యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ తన పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని, స్వదేశీ తయారీ మంత్రమే మన దేశానికి కీలకం అని మోదీ పేర్కొన్నారు.  పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తాను చేసిన పలు సూచనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.
దేశ భద్రత స్వయం సమృద్ధి దిశగా భారత్​ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 2026 తొలి ఆరు నెలలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఈ కాలంలో భారత్ అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించిందని గుర్తుచేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో వచ్చిన పురోగతి దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.  స్వదేశీ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత, బలమైన రక్షణ వ్యవస్థలతో భారత్ త్వరితగతిన ఆత్మనిర్భరత వైపు దూసుకుపోతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 
దేశంలో తయారైన సైనిక సాంకేతికత, స్వదేశీ ఉత్పత్తుల పెరుగుదలతో భారత్ మరింత శక్తివంతంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. విమానయాన రంగంలోనూ భారత్ కీలక విజయాన్ని సాధించిందని తెలిపారు. స్వదేశీ సి-295 సైనిక రవాణా విమానం తొలి విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసిందని ఆయన చెప్పారు.  ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోనే 40 విమానాలు తయారవుతున్నాయని, ఇది ఎంఎస్‌ఎంఈలు, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని ఆయన వివరించారు.
అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యం మరింత బలపడుతోందని చెప్పారు. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన నలంద విశ్వవిద్యాలయం, ఆధునిక విద్యా వ్యవస్థతో పాటు పురాతన భారతీయ విలువలను సమన్వయం చేస్తూ కొత్త తరానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రధాని కొనియాడారు. రెండేళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించిందని గుర్తుచేసుకున్న ప్రధాని, ఈ సంస్థ భారతీయ ప్రాచీన ‘శాస్త్రార్థ’ సంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చిందని చెప్పారు.