కీలక రక్షణ వ్యవస్థల కోసం అమెరికా రూ 3,600 కోట్ల సహాయం 

కీలక రక్షణ వ్యవస్థల కోసం అమెరికా రూ 3,600 కోట్ల సహాయం 
భారత్‌కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలను కొత్త ఆయుధాల కొనుగోలు కోసం కాకుండా ఇప్పటికే భారత సైన్యంలో సేవలందిస్తున్న అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్లకు అవసరమైన నిర్వహణ, సాంకేతిక సహాయం, విడిభాగాల సరఫరా, శిక్షణ సేవలను అందించనుంది.
 
అమెరికా విదేశీ సైనిక విక్రయాల (ఎఫ్‌ఎంఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించే డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) జూన్ 17న ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత నెల మే 18నే అమెరికా విదేశాంగ శాఖ భారతదేశానికి ఈ సేవలను అందించేందుకు కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.  దీంతో భారత్‌ అమ్ములపొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్‌, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు.
అమెరికా ఇవ్వనున్న 428.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో 198.2 మిలియన్ డాలర్లను ఏహెచ్-64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్వహణ కోసం కేటాయించారు. ఇందులో ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక సహాయం, లాజిస్టిక్ మద్దతు, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి.  ఈ ప్యాకేజీకి బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటాయి. మరో 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఎం-777 ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ తుపాకుల నిర్వహణకు కేటాయించారు.
దీనిలో విడిభాగాలు, సాంకేతిక సహాయం, శిక్షణ, లాజిస్టిక్ మద్దతు వంటి సేవలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన కాంట్రాక్టర్‌గా బీఏఈ సిస్టమ్స్ వ్యవహరించనుంది.  ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా భారత్​తో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇండో- పసిఫిక్ ప్రాంతం, దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక అభివృద్ధికి భారత్​ కీలక భాగస్వామిగా కొనసాగుతోందని అమెరికా అభిప్రాయపడింది.
భారత్​ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ సహాయ ప్యాకేజీ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా తెలిపింది. ప్రస్తుతం, భవిష్యత్​లో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదిత సేవలు ప్రాంతీయ సైనిక సమతుల్యతను మార్చవని అమెరికా స్పష్టం చేసింది. అలాగే అమెరికా రక్షణ సన్నద్ధతపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. భారత సాయుధ దళాలు ఈ సేవలు, పరికరాలను సమర్థంగా వినియోగించగలవని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది.