పలు విశ్వవిద్యాలయంలలో డిగ్రీలుపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’  

పలు విశ్వవిద్యాలయంలలో డిగ్రీలుపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’  
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాలలోని పలు రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు డిగ్రీలు, మార్క్‌షీట్లు, అధికారిక పత్రాలపై “ఇండియా” అనే పదం స్థానంలో “భారత్”ను ఉపయోగించాలని నిర్ణయించాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో, జూన్ 21, ఆదివారం నాడు, ప్రదానం చేయబోయే అన్ని డిగ్రీలపై “ఇండియా”కు బదులుగా “భారత్” అని ముద్రించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు. విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ రాజేష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, అన్ని డిగ్రీలు, మార్క్‌షీట్లపై హిందీ, ఆంగ్లం రెండింటిలోనూ “భారత్” అనే పదాన్ని ఉపయోగించాలని తమ కార్యనిర్వాహక మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. జీ20 సదస్సులో “భారత్” అనే పదాన్ని ఉపయోగించడాన్ని అందుకు గల కారణాలలో భాగంగా ఉదహరిస్తూ, “మనం భారత్ ప్రజలం, దేశం  అసలు పేరు భారత్. ఇండియా అనే పేరు ఆ తర్వాత వచ్చింది,” అని ఆయన పేర్కొన్నారు.
 
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీ సుమారు ఆరు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించి విశ్వవిద్యాలయ స్టాండింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించిందని వైస్ ఛాన్సలర్ అలోక్ కుమార్ చక్రవాల్ చెప్పారు.  ప్రస్తుతం ఉన్న మార్క్‌షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్ల నిల్వలు పూర్తయిన తర్వాత ఈ మార్పు అమలు చేస్తామనిఆయన చెప్పారు. 
 
“చారిత్రకంగా, ఆర్యావర్త, జంబూద్వీప ప్రాంతాలను ‘భారత్’ అని పిలిచేవారు. ‘ఇండియా’ అనే పేరును విదేశీయులు తమ సౌలభ్యం కోసం పెట్టారు. బయటివారు ఏమనుకున్నారనే దాని ఆధారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. మన సంస్కృతి, సంప్రదాయం ఎల్లప్పుడూ ఈ దేశాన్ని ‘భారత్’ అని పిలిచాయి, మేము ఆ సంప్రదాయాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాము” అని తెలిపారు. 
 
భారతీయ భాషా మంచ్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎం.ఎల్. గుప్తా మాట్లాడుతూ, ఈ మార్పు కోసం తమ సంస్థ విస్తృతంగా ప్రచారం చేసిందని తెలిపారు. తన “ఇండియా నహీ భారత్” అనే పుస్తకంలో, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు అధికారిక ప్రయోజనాల కోసం కేవలం “భారత్” అనే పదాన్ని మాత్రమే ఉపయోగించాలని తీర్మానాలు చేశాయని గుప్తా వెల్లడించారు. 
 
మధ్యప్రదేశ్‌లో ఈ చర్య తీసుకున్న మొదటి విశ్వవిద్యాలయం తమదేనని ఇండోర్‌లోని దేవి అహల్యా విశ్వవిద్యాలయం చెబుతోంది. దాని వైస్-ఛాన్సలర్ రాకేష్ సింఘాయ్ మాట్లాడుతూ, “ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించిన మొదటి విశ్వవిద్యాలయం మేమే. ఇప్పటికే ప్రతిచోటా రాతపూర్వకంగా ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను ఉపయోగించాము. మేము చూపిన మార్గాన్ని ఇతర విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్నాయి,” అని పేర్కొన్నారు. 
 
గ్వాలియర్ లోని రాజా మాన్‌సింగ్ తోమర్ సంగీత, కళల విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ స్మిత సహస్రబుధే మాట్లాడుతూ, న్యాస్ ప్రతినిధి బృందం చేసిన వాదనలతో తమ కార్యనిర్వాహక మండలి “సమ్మతించిందని”, అదే విధమైన తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు. “హిందీని రాష్ట్ర భాష అంటారు, కాబట్టి ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ను ఉపయోగించాలి,” అని ఆమె చెప్పారు.