యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది జీవన విధానం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా యోగా వన్ డే కౌంట్ డౌన్ వేడుకలలో పాల్గొంటూ ఈ రోజు మనం కేవలం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదని, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయానికి గౌరవం తెలుపుతున్నామని చెప్పారు.
యోగా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక మహోన్నత సాధనం అని చెబుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని నేడు ప్రపంచమంతా స్వీకరించడం మనకు గర్వకారణం అని తెలిపారు. నేడు యోగా దేశాల సరిహద్దులు, భాషలు, సంస్కృతులను దాటి ప్రపంచ మానవాళిని ఏకం చేసే శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా మనకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదించే మహత్తర సాధనం అని గవర్నర్ చెప్పారు. గత 12 సంవత్సరాలలో భారత్ “వికాస్ భీ – విరాసత్ భీ” అనే మంత్రంతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని, నేడు భారతదేశానికి చెందిన 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రపంచ వేదికపై మన గొప్ప సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.
ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా నేడు ఒక ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారిందని, గత కొన్ని సంవత్సరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో 26 కోట్లకు పైగా ప్రజలు పాల్గొనడం, భారతదేశపు ఈ ప్రాచీన జ్ఞానం ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతోందని స్పష్టం చేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. ఆధునికతను స్వీకరిస్తూనే మన సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఉండవచ్చని, అదే భారతదేశ మార్గం, అదే మన ప్రత్యేకత, అదే మన అతి పెద్ద బలం అని తెలిపారు.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా మన దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని సంకల్పిద్దామని గవర్నర్ సూచించారు. అలాగే మన సంస్కృతి, వారసత్వం, విలువలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తిద్దామని చెప్పారు. ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన, సాంస్కృతిక చైతన్యంతో కూడిన భారత నిర్మాణంలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపిచ్చారు.

More Stories
`మానస’లో ఆకట్టుకున్న ప్రత్యేక పిల్లల యోగా, హరిత కార్యక్రమాలు
సింగరేణి కాంగ్రెస్ పాలకులకు ‘లంకెబిందె’
జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ పక్రియ ప్రారంభం