నీట్‌ రీటెస్ట్‌కు భారీ ఏర్పాట్లు.. యుద్ధ విమానాల్లో ప్రశ్నాపత్రాలు!

నీట్‌ రీటెస్ట్‌కు భారీ ఏర్పాట్లు.. యుద్ధ విమానాల్లో ప్రశ్నాపత్రాలు!
* నేడు దేశవ్యాప్తంగా  ఎన్టీఏ మాక్‌డ్రిల్‌
 
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలవడంతో ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ నెల 21న జరిగే నీట్‌ రీటెస్ట్‌కు  కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్రం చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే ఒక ప్రవేశ పరీక్షకా లేక యుద్ధానికా ఏర్పాట్లు చేస్తున్నది అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.  దీని కోసం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా రంగంలోకి దిగి పరీక్ష ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తుంది. 
నీట్‌ రీటెస్ట్‌ ఏర్పాట్లలో భాగంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం దేశవ్యాప్తంగా ఒక మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తున్నది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మాక్‌డ్రిల్‌లో దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు.  ఇప్పటికే పరీక్షలు జరిగే కేంద్రాలను ఎన్టీఏ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పరీక్ష జరిగే రోజు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ఈసారి నీట్‌ పేపర్‌ ఎట్టిపరిస్థితుల్లో లీక్‌ కారాదన్న భయంతో పేపర్‌ లీక్‌కు అవకాశాలు ఉన్న అన్ని మార్గాలను మూసివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది.  ఇప్పటికే ఎలాంటి ప్రశ్న పత్రాలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్‌ కాకుండా మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్‌డౌన్‌ విధించింది. 
దేశంలోని అన్ని ప్రాంతాలకు నీట్‌ ప్రశ్నపత్రాలను సురక్షితంగా చేర్చేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఒక భారీ వైమానిక లాజిస్టిక్స్‌ మిషన్‌ను చేపట్టింది. 
 
దీని కోసం ఐఏఎఫ్‌ గత నాలుగు రోజుల నుంచి 200కు పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నది. వీటి ద్వారా వివిధ రాష్ట్ర రాజధానులు గల 18 కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించారు. జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసివేయించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఇక భద్రతా పర ఏర్పాట్ల విషయానికొస్తే మొబైల్‌ జామర్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, రెండు అంచెల తనిఖీలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నిఘాలో పరీక్ష కేంద్రాలను ఉంచింది.
 
దేశ వ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించే నీట్‌ రీటెస్ట్‌కు 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షల కోసం రెండు లక్షల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గోప్యమైన పరీక్షా సామగ్రిని భద్రపర్చడం, రవాణా చేయడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా ఉంటుంది. 
 
పరీక్ష హాలులోకి వెళ్లే ముందు అభ్యర్థుల తనిఖీ తప్పనిసరి. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ నిర్ధారణ తప్పనిసరి. ఇక పరీక్షా కేంద్రాలు విద్యుత్‌ బ్యాకప్‌, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. పరీక్షకు సంబంధించి ఎన్టీఏ అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  మొబైల్‌ ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, బ్లూటూత్‌ డివైజ్‌లు, ఇయర్‌ ఫోన్లు, లోహ వస్తువులు, పెద్ద బకెల్స్‌ ఉన్న బెల్ట్‌లు, భారీ జ్యువెలరీ, యాక్సెసరీస్‌తో అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అయితే అభ్యర్థులు మతపరమైన చిహ్నాలు ధరించొచ్చు. కలవ, తలపాగా, హిజాబ్‌ లేదా అలాంటి తరహా వస్తువులతో పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.  తేలికపాటి దుస్తులు, పూర్తి చేతుల దుస్తులు, ఉలెన్‌ బట్టతో ఉన్న దుస్తులు ధరించొచ్చు. పారదర్శకంగా ఉన్న నీటి సీసా తీసుకురావచ్చు. నీట్‌ రీ ఎగ్జామ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్‌ను నమ్మవద్దని తెలిపిన ఎన్‌టీఏ అభ్యర్థులకు కోసం 917827980287 నంబర్‌తో అధికారిక వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. 
 
‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్‌ ఉంటుంది. అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌లు ఈ నంబర్‌ నుంచే వస్తాయని ఎన్‌టీఏ తెలిపింది. బ్లూ టిక్‌ లేకుండా వచ్చే ఏ సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. ఈ నంబర్‌ నుంచి వాట్సాప్‌ నోటిఫికేషన్లతో పాటు, అభ్యర్థులు తన అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. 
 
అధికారిక ఎస్‌ఎంఎస్‌లు NICPEP అనే సెండర్‌ ఐడీ నుంచి, ఈ మెయిల్స్‌ no-reply.neet.nta@nic.in నుంచి మాత్రమే వస్తాయని తెలిపింది. మే 3న పరీక్ష కోసం జారీ చేసిన అడ్మిట్‌ కార్టు ఈ రీ ఎగ్జామ్‌కు చెల్లదని స్పష్టం చేసింది.