రెబల్స్‌‌పై టిఎంసి వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు

రెబల్స్‌‌పై టిఎంసి వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు
 
తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం వినతిపత్రం అందజేసింది. రెబల్స్‌పై వేర్వేరుగా మొత్తం 20 అనర్హత పిటిషన్లను ఓం బిర్లాకు అందించినట్టు మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు. తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమయ్యామని, సభలో తమను ఒక ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని రెబెల్ ఎంపీలు చేసిన వాదన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. 
 
సమావేశం అనంతరం మాట్లాడిన బెనర్జీ రెబెల్ ఎంపీలు అంతకుముందే స్పీకర్‌ను కలిసి తమను తాము ఒక ప్రత్యేక గ్రూపుగా పరిచయం చేసుకున్నారని చెప్పారు. ‘‘20 మంది స్పీకర్‌ను కలిసి తమను ఒక ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరారు. ఆ తర్వాత, ఆ ఎంపీలు ఎన్సీపీఐ అనే మరో పార్టీలో చేరినట్లు చెప్పుకున్నారని మాకు తెలిసింది.. ఈ గ్రూపు పేరు ఎవరూ వినలేదు. కనీసం వారు కూడా ఈ పార్టీ పేరు వినలేదు” అని విస్మయం వ్యక్తం చేశారు.

“పదో షెడ్యూల్‌లోని సెక్షన్ 2 ప్రకారం, ఒక సభ్యుడు స్వచ్ఛందంగా తన అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే, అతడు తన సీటును కోల్పోతాడు. కాబట్టి, వారు ఒక పార్టీ గుర్తుపై గెలిచి, రెండేళ్ల తర్వాత కొత్త పార్టీలో చేరుతున్నామని చెబుతుంటే వారు సభ్యత్వాన్ని రద్దు చేయాలి’’ అని ఆయన కోరారు. ‘‘ఈ పిటిషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేశాం. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది’’ అని అభిషేక్ చెప్పారు.

ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు లేదా నాయకుడి నియామకం వంటి రెబల్స్ ఇతర డిమాండ్లను ఆయన ద్వితీయమైనవిగా పేర్కొన్నారు. రెబల్స్ కోరుకుంటే భవిష్యత్ ఎన్నికలలో ఏ పార్టీ టిక్కెట్‌పైనైనా పోటీ చేయవచ్చని పేర్కొంటూ అయితే పార్టీని వీడటం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను వారు ముందుగా ఎదుర్కోవాలని బెనర్జీ స్పష్టం చేశారు. వారు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘‘వారు పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేశారు. వారు తమ మనస్సాక్షిని, గౌరవాన్ని అమ్ముకున్నారు. బెంగాల్ ప్రజలు వారిని క్షమించరు’’ అని అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. మహారాష్ట్రలోని శివసేనలో ఇటీవల జరిగిన పరిణామాలను కూడా అభిషేక్ ప్రస్తావించారు. రెబల్స్‌ను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించాలన్న డిమాండ్‌పై నిర్ణయం తీసుకునే ముందు, తన అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ నేతను స్పీకర్ ఆహ్వానించిన నేపథ్యంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.

జూన్ 10న తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ప్రత్యేక వర్గంగా చెప్పుకుంటున్న ఏ గ్రూపునకు కూడా ఎలాంటి గుర్తింపు, హోదా లేదా సౌకర్యం కల్పించవద్దని కోరుతూ బెనర్జీ స్పీకర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ఒక రాజకీయ పార్టీలోనే మరొక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడటానికి రాజ్యాంగం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనుమతించవని ఆయన వాదించారు.
తృణమూల్ కాంగ్రెస్‌ను ఒకే ఒక రాజకీయ పార్టీగా పరిగణించాలని, సభలో దాని ద్వారా అధికారికంగా నియమించిన నాయకుడు, విప్ ద్వారా మాత్రమే ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని బెనర్జీ కోరారు. అలాగే ఈ విషయంపై తమ వాదనను వినిపించడానికి పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బెనర్జీ ఇక్కడ ఉదహరించారు.
పదో షెడ్యూల్ కింద పార్టీలో చీలిక వచ్చింది అనే వాదనను సమర్థించుకునే అవకాశం ఇకపై లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత చట్టపరమైన నిబంధనల ప్రకారం ఒకే ఒక రాజకీయ పార్టీని గుర్తించాల్సి ఉంటుందని, అంతే తప్ప పార్టీలోని ప్రత్యర్థి వర్గాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అభిషేక్ బెనర్జీతోపాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సౌగతా రాయ్, డెరెక్ ఒబ్రియెన్ పాల్గొన్నారు. అభిషేక్ బెనర్జీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఎంపీల విలీనం లేదా అనర్హత వేటు అంశాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.