“సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంగు బంగారంగా చెప్పుకుంటూ నిలువునా ముంచితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి దోచుకుంటూ అప్పుల ఊబిలోకి నెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిదానికీ లంకెబిందెలు అంటుంటారు. కానీ ఆయనకు నిజంగానే సింగరేణి రూపంలో లంకెబిందెలు దొరికినట్లు ఉన్నాయి. అందుకే ఇక్కడి సంపదను దోచుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు” అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే హౌస్ కమిటీ వేయాలి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. `సింగరేణిని కాపాడుకుందాం’ అనే అజెండాతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మైన్ విజిట్ కోసం బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందాన్ని ప్రభుత్వం అడ్డుకొని, దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
మూడు రోజుల క్రితమే ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రఘునాథరావుతో కలిసి లెటర్ ఇచ్చి, ఎండీ ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులను ప్రయోగించి, కార్యకర్తలను, నాయకులను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క సింగరేణి అవినీతిపై చిలుక పలుకులు పలికారని, తీరా ఇప్పుడు అధికారం చేతికి రాగానే విద్యుత్ శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఈ వ్యవస్థను జేబులో పెట్టుకొని, గత పాలకుల అక్రమాలను కప్పిపుచ్చుతూ బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
గత 2014 నుండి 2023-24 వరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలను ఎండగడుతూ 2014లో తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను కేంద్రం కేటాయిస్తే, క్వాలిటీ లేదనే నెపంతో రిటర్న్ చేసి, ఆ తర్వాత నాటి ప్రభుత్వ స్నేహితుడైన ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెట్టారని తెలిపారు. ప్రతి టన్నుకు రూ. 560 ఎస్కలేషన్ ఉండాల్సి ఉంటే, ఏకంగా రూ. 3,500 లకు పెంచి రూ. 20,000 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని చెబుతూ దీనిపై కాంగ్రెస్ ఎందుకు విచారణ దని ప్రశ్నించారు.
అలాగే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) లో నైనీ గనుల బొగ్గును తీసుకోకుండా బ్రిడ్జ్ లింకేజ్ ఇవ్వకపోవడం వల్ల రూ. 289.91 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. సొంత అవసరాల విద్యుత్‌ను డిస్కంలకు తక్కువకు అమ్మి, మళ్లీ ఎక్కువ ధరకు బయట కొనుగోలు చేయడం వల్ల రూ. 288.96 కోట్లు, నాసిరకం బొగ్గు వినియోగం వల్ల రూ. 156.10 కోట్లు, బాయిలర్ ట్యూబ్ లీకేజీతో 53 గంటలు ప్లాంట్ నిలిచిపోవడం వల్ల రూ. 219.58 కోట్లు, బూడిదలో కాలిపోని బొగ్గు వల్ల రూ. 27 కోట్లు.. ఇలా మొత్తంగా ఎస్టీపీపీలోనే రూ. 982 కోట్ల నష్టం తెచ్చారని లెక్కలతో సహ ఏలేటి వివరించారు.
2018 నుండి 2023 వరకు సింగరేణిలో మంజూరు చేసిన 36 ఓబీఆర్ కాంట్రాక్టులలో సాధారణ టెండర్లు మైనస్ 10% నుండి 15% లోపు వస్తుంటే, సింగరేణిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 12.36% నుండి 32% వరకు అత్యధిక రేట్లకు ప్రైవేట్ గుత్తేదారులకు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. అక్రమాల వల్ల రూ. 51.05 కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్టు కోడై కూస్తున్నా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని బిజెపి నేత నిలదీశారు.
కాంట్రాక్టుల ఆలస్యం వల్ల రూ. 74.19 కోట్లు, సర్ఫేస్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వినియోగదారుల నుండి అదనంగా రూ. 78.94 కోట్లు వసూలు చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. శ్రీరాంపూర్ ఏరియాలో టన్ను రూ. 78 కే లభించే బాటం యాష్‌ను వదిలేసి, టన్నుకు రూ. 263 చెల్లించి ఇసుకను కొనడం ద్వారా రూ. 26 కోట్ల నష్టం తెచ్చారని, ఇలా గత పాలకుల వల్ల రూ. 1430 కోట్ల నష్టం వాటిల్లిందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
వీకేఓసీ ఓపెన్ కాస్ట్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డికి ఏమవుతాడో, ఎంత అత్యధిక రేటుకు దాన్ని కట్టబెట్టారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ చేశారు. అలాగే కేంద్రం కేటాయించిన నైనీ బ్లాక్ టెండర్లలో సీఎం తన మనిషికి కావాలని, డిప్యూటీ సీఎం తన మనిషికి కావాలని కొట్లాడుకొని, చివరకు ఆ టెండర్లనే రద్దు చేశారని ఆయన ఆరోపించారు.
గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి నేరుగా డీజిల్ కొనేవారని, ఇప్పుడు మధ్యవర్తులు, గుత్తేదారుల ద్వారా కొంటూ సింగరేణిపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని, రూ. 1,600 కోట్ల కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రికి లేఖ రాస్తే ఇప్పటివరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 51,500 కోట్ల బకాయిలను సింగరేణికి చెల్లించకుండా తొక్కిపెట్టిందని, ఆ డబ్బులు ఇచ్చుంటే 40 వేల మంది కార్మికుల కుటుంబాలకు క్వార్టర్లు, నీరు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, మైన్స్‌లో కనీస రక్షణ (సేఫ్టీ) పరికరాలు సమకూరేవని ఆవేదన వ్యక్తం చేశారు.
సోలార్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా మెగావాట్ సోలార్ ప్రాజెక్టుకు రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంటే, సింగరేణిలో 107 మెగావాట్ల ప్రాజెక్టును రూ. 5.04 కోట్ల చొప్పున చేపట్టి రూ. 200 కోట్లు అదనంగా దోచుకున్నారని, అలాగే 67 మెగావాట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ. 7 కోట్ల చొప్పున రూ. 480 కోట్లు తగలేసి ఇప్పటికీ గ్రిడ్‌కు అనుసంధానం చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల, ప్రజా సమస్యల పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని, రాబోయే రోజుల్లో దీనిపై బలమైన కార్యాచరణ ప్రకటిస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
More Stories
రాయచోటి `రహస్య జీవనం’లో హిందూ ప్రముఖుల హత్యకు ఆలీ కుట్ర!
రెబల్స్‌పై టిఎంసి వేర్వేరుగా 20 అనర్హత పిటిషన్లు
జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ పక్రియ ప్రారంభం