సమాజంలో మార్పులు తీసుకు రావడంలో  జెన్ జెడ్ కీలక పాత్ర

సమాజంలో మార్పులు తీసుకు రావడంలో  జెన్ జెడ్ కీలక పాత్ర
 
పుణె శ్రామిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో సునీల్ అంబేకర్  
 
“దేశంలోని కొత్త తరం, జెన్ జెడ్ పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత ఆశాజనకంగా ఉంది. నేటి యువత తమ సంప్రదాయాలకు, భారతదేశపు ఘనమైన చరిత్రకు కనెక్ట్ అయి ఉన్నారు. ఈ తరం సమాజంలో సానుకూల, నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడానికి గణనీయమైన కృషి చేస్తోంది,” అని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 
సంఘ్ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవీ పేఠ్‌లో పుణె శ్రామిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో,  మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ  ఇటువంటి ఉద్యమాలను చూసి ఆశ్చర్యపోవాల్సిన లేదా దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.  
 
 “భారతదేశంలో అన్ని స్థాయిలలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. మన న్యాయస్థానాలు, పరిపాలన, మీడియా పూర్తి స్వాతంత్ర్యంతో పనిచేస్తాయి. ఇంతటి పటిష్టమైన ప్రజాస్వామ్యంలో, ఎవరైనా గళం విప్పితే, వ్యవస్థ తప్పక విని తగిన చర్యలు తీసుకోగలగాలి” అని స్పష్టం చేశారు. 
 
ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొందరు రాజకీయ నాయకులు వ్యాపింపజేస్తున్న గందరగోళాన్ని ఆయన ఖచ్చితంగా ఖండిస్తూ, “ఆర్ఎస్ఎస్ చట్టబద్ధమైన ఉనికికి సంబంధించి ఎలాంటి చట్టపరమైన వివాదం లేదు. కేవలం స్వల్ప రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించేందుకు దురుద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు. 
 
“ఆర్ఎస్ఎస్ పూర్తిగా చట్టబద్ధమైన, గుర్తింపు పొందిన సామాజిక సంస్థ. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, అన్ని ప్రభుత్వాలు వివిధ జాతీయ విపత్తులలో, నిర్మాణాత్మక పనులలో ఆర్ఎస్ఎస్‌ను చురుకుగా భాగస్వాములను చేశాయి. నిబంధనల ప్రకారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అంతేకాకుండా, మా స్థానిక శాఖలు అధీకృత బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాయి” అని అంబేకర్ తెలిపారు. 
 
ఆర్ఎస్ఎస్ అన్ని ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా, కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతాయని, ఆర్ఎస్ఎస్ తన రోజువారీ శాఖల వ్యవస్థ ద్వారా ప్రతిరోజూ సమాజానికి నేరుగా జవాబుదారీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సమాజానికి, సంఘ్‌కి మధ్య ఉన్న సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ, సంఘ్ స్థాపనకు చాలా కాలం ముందు నుంచే దేశంలో హిందూ-ముస్లిం సంఘర్షణ ఉండేదన్నది చారిత్రక వాస్తవం అని గుర్తు చేశారు. 
 
“దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యానికి ముందు, ‘ఆరాధనా విధానాన్ని మార్చడం దేశాన్ని, పూర్వీకులను, చరిత్రను మార్చేస్తుంది’ అనే విషపూరిత భావన ముస్లిం సమాజంలో పెరిగింది. ఈ విభజనవాద మనస్తత్వమే దేశ విభజనకు కారణమైంది. ఇప్పుడు ముస్లిం సమాజం నుంచే సామాజిక సంస్కరణల కోసం సానుకూల కార్యక్రమాలు వెలువడటం హర్షదాయకం. భారతీయ ముస్లింలు స్ఫూర్తి కోసం పాకిస్తాన్ వైపు కాకుండా, ఇస్లాంను స్వీకరించినప్పటికీ తన అసలైన హిందూ సాంస్కృతిక మూలాలను కాపాడుకున్న ఇండోనేషియా సాంస్కృతిక ఆదర్శాల వైపు చూడాలి”  అని చెప్పారు. 
 
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ప్రస్తుతం, యూరప్, చైనా వంటి దేశాలు తమ ఆత్మహత్యా సదృశ జనాభా విధానాల కారణంగా యూ-టర్న్ తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశ సందర్భంలో జనాభా సమతుల్యతను కాపాడుకోవడం జాతీయ భద్రతకు మరింత ముఖ్యం”  అని స్పష్టం చేశారు. 1947 నాటి దురదృష్టకర విభజనను గుర్తుచేసుకుంటూ, దేశ విభజనకు “జనాభా అసమతుల్యత” కూడా ఒక కారణమని ఆయన హెచ్చరించారు.
 
భవిష్యత్తులో ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి అసమతుల్యత మళ్లీ తలెత్తితే, ఐక్య భారతదేశపు గుర్తింపు, భద్రత, శాశ్వత సంస్కృతిని కాపాడటం అత్యంత కష్టమవుతుందని అంబేకర్ తెలిపారు. అందువల్ల, భారతీయ సంస్కృతిని, దేశభక్తిని విశ్వసించే అత్యధిక పౌరులు దేశంలోని ప్రతి ప్రాంతంలో, ప్రతి మూలలో ఉండటం అత్యవసరం అని చెప్పారుఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌మోహన్ పాటిల్, ప్రధాన కార్యదర్శి మంగేష్ ఫల్లే కూడా వేదికపై పాల్గొన్నారు.