భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ)కి చెందిన శాసన విభాగం ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన విస్తృత శాసన సర్వేలో దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలానికి చెందిన అనేక శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఈ ప్రాంత రాజకీయ, సాంస్కృతిక, భాషాపరమైన చరిత్రకు సంబంధించి కొత్త అవగాహనను కల్పిస్తున్నాయి.
అలాగే క్రీస్తు పూర్వం 1500 కాలం నాటివిగా భావిస్తున్న పురాతనమైన రాతిపై చిత్రీకరించిన చిత్రలేఖనాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చర్రిత, శాసనాలు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అవగాహన పెరగడానికి గణనీయంగా దోహపడతాయని భావిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటన ముగిసిన అనంతరం ఎఎస్‌ఐ మైసూరు విభాగ ఎపిగ్రఫీ డైరెక్టర్ కె.మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో తమ బృందాలు 2వ శతాబ్దం సిఇ నుండి 16వ శతాబ్దం సిఇ మధ్య కాలానికి చెందినవిగా భావిస్తున్న 25 శాసనాలను డాక్యుమెంట్ చేసి, కాపీ చేశామని చెప్పారు.
వీటిలో శాతవాహనులు, తూర్పు చాళుక్యలు, కల్యాణి చాళుక్యలు, పోతపి చోళులు, కాకతీయులు, రెడ్డి పాలకులు, విజయనగరం సామ్రాజ్యంతో సహా వివిధ రాజవంశాలకు చెందిన అనేక శాసనాలు వున్నాయన్నారు. నల్లమల పులుల సంరక్షణ అటవీ ప్రాంతం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో మారుమూల చోట్ల సర్వే బృందం అన్వేషణ జరిపింది.
మొదటి రోజైన 11వ తేదీ నాడు 8 శాసనాలు కనుగొన్నారు. గంగారం పెంట, మీతొంట, పాల్తిల, పొన్నాలబావి, జిల్లాలపడుగు గ్రామాల్లో ఈ శాసనాలు కనిపించాయి. 7నుండి16వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన ఈ శాసనాలు తెలుగులో రాయబడ్డాయి. రెండో రోజు తెలుగు, కన్నడ భాషల్లో రాసిన 10శాసనాలు కనిపించాయి.
ఇక మూడో రోజు మరో ఏడు శాసనాలు బయటపడ్డాయి. ఇవి ప్రాకృతి, బ్రహ్మ లిపిల్లో రాసినవి. వాటిల్లో అత్యంత అరుదైన శాతవాహన కాలం నాటివి కూడా వున్నాయి. నల్లమల టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున గల అలటం సమీపంలో రాతి పలకపై ప్రాచీన రాతి చిత్రలేఖనం శనివారం బయటపడింది. క్రీస్తు పూర్వం 1500 నాటివిగా భావిస్తున్న ఈ రాతి చిత్రలేఖనాలు మహాశిల యుగం నాటివని, తొలినాటి చారిత్రక చిత్రలేఖనాలని ప్రాధమిక అంచనాలను బట్టి తెలుస్తోంది.
దీన్ని బట్టి 3500ఏళ్ళకు పూర్వమే ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు సాగాయని తెలుస్తోంది. అత్యంత సవాళ్ళతో కూడిన రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పనిచేసిన సర్వే బృందాలకు తోడ్పాటునందించినందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు, అటవీ శాఖాధికారులకు డైరెక్టర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు.

More Stories
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం..19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్ పై ఘన విజయం
ఒమన్ తీరంలో14 మంది భారతీయ నావికులకు తప్పిన ముప్పు