తిరుమలలో ఏఐ ఆధారిత సేవల నిర్వహణ ప్రశంసనీయం

తిరుమలలో ఏఐ ఆధారిత సేవల నిర్వహణ ప్రశంసనీయం

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు.

శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా వసతి గదుల ఆక్యుపెన్సీ వివరాలు, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని చెప్పారు.

ఈ కేంద్రం ద్వారా గదుల లభ్యత, వివిధ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య, గంటల వారీగా తిరుమలకు చేరుకుంటున్న భక్తుల వివరాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తోందని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సాంకేతికతను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. 

ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రవాస భారతీయ భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేవలం 100 రోజుల లోపే ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ అధికారులను అభినందించారు. అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. 

తిరుమలలో  తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, జీవితాంతం దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో తన జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు. దేశ సేవకు, ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేసేలా శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.