అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి కార్యకర్తలు, దేశ ప్రజలకు “ఏక్ పేడ్ మా కే నామ్” అని ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేతలు మొక్కలు నాటారు. మహబూబాబాద్‌లో బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్క నాటుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబం తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటేలా ఉద్యమం రూపంలో ముందుకు సాగాలని రామచందర్ రావు పిలుపిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 260 కోట్లకు పైగా మొక్కలు నాటడం ద్వారా భారతదేశాన్ని మరింత పచ్చదనంతో నింపుతూ, పర్యావరణ పరిరక్షణకు గొప్ప కృషి జరుగుతోందని తెలిపారు.
ప్రకృతిని కాపాడడం, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నివారణ, జీవవైవిధ్య సంరక్షణ (బయోడైవర్సిటీ) కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు అందరూ స్పందించాలని కిషన్ రెడ్డి కోరారు.
పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సుస్థిరాభివృద్ధి, హరిత అభివృద్ధి (గ్రీన్ గ్రోత్) లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగస్వాములై, హరిత భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.

More Stories
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకం
తెలంగాణాలో రూ 7,597 కోట్లతో రెండు రహదారుల విస్తరణ
ఎసిబి సోదాల్లో అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్