అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధితో పనిలేకుండా, సురక్షితంగా వాణిజ్యాన్ని సాగించేందుకు ఒమన్‌తో ఆరు నెలల ముందు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీఈపీఏ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇదొక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, భారత ఇంధన, ఆర్థిక భద్రతకు పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడి అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ విశ్లేషించింది.
ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల నుంచి భారత్‌కు వచ్చే చమురుకు ఈ యుద్ధం వల్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఇతర గల్ఫ్ దేశాలకు భిన్నంగా ఒమన్ తీరప్రాంతం హర్మూజ్ జలసంధికి వెలుపల నేరుగా అరేబియా సముద్రం వైపు ఉంటుంది. దీనివల్ల గల్ఫ్‌లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఒమన్‌లోని సలాలా, దుక్మ్ పోర్టుల ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్‌కు ఇంధన, వాణిజ్య రవాణా జరుగుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ పేర్కొంది.
గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన సీఈపీఏ ఒప్పందంలో భాగంగా ఒమన్ దాదాపు 98 శాతం భారత ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తక్షణమే రద్దు చేసింది. దీనివల్ల పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, బియ్యం, యంత్రాల ఎగుమతులకు మేలు జరగనుంది. అటు ఒమన్ నుంచి వచ్చే ముడి చమురు, ఎల్ఎన్జీ, వ్యవసాయ ఎరువులు, అమోనియాపై సుమారు 78 శాతం టారిఫ్‌లను భారత్ తగ్గిస్తోంది.
కేవలం వాణిజ్యాన్నే కాదు, ఇంధన భద్రతను నిర్ధరించుకునే దిశగా ఈ ఒప్పందం పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన గల్ఫ్ దేశాల నుంచి భారత దిగుమతులు 2025 ఏప్రిల్‌లో 15 బిలియన్ డాలర్లు ఉండగా, 2026 ఏప్రిల్ నాటికి 9.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు కూడా తగ్గాయి. కానీ ఒక్క ఒమన్ నుంచి మాత్రం భారత దిగుమతులు ఏకంగా 246.4 శాతం పెరిగి, 430 మిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
హర్మూజ్ జలసంధి గుండా రవాణా రిస్క్‌గా మారినప్పుడు ఒమన్ అద్భుతమైన ప్రత్యామ్నాయమని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ విశ్లేషించారు. గడిచిన ఐదేళ్లలో భారత్ 5 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒమన్‌తో చేసుకున్న ఒప్పందం వల్ల పశ్చిమాసియాలో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాణిజ్య, ఇంధన సంక్షోభం తలెత్తకుండా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Stories
`పిఎం స్వానిధి’ ద్వారా 80 లక్షల వీధి వ్యాపారులకు రూ 17,800 కోట్లు
వియత్నాంకు బ్రహ్మోస్ విక్రయించేందుకు ఒప్పందం
మరోసారి పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు