భారతదేశపు మామిడి పండ్ల దిగుమతిని జపాన్ ఈ ఏడాది మామిడి సీజన్‌లో నిలిపివేసింది. 20 ఏండ్లలో తొలిసారిగా భారతీయ మధుర ఫలాలపై జపాన్ నిషేధం అమలులోకి వచ్చింది. భారతదేశంలో పండ్ల చెట్లకు తెగుళ్ల నివారణ చర్చలలో నిర్లక్షం, తప్పిదాలు ఉన్నట్లు జపాన్ అధికారులు గుర్తించారు. ఇటువంటి పండ్లు తమ దేశంలోకి వస్తే తమ దేశీయ వ్యవసాయ రంగానికి ఇక్కట్లు ఏర్పడుతాయని నిర్థారించారు.
ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్‌లో ఉన్న ఒక ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు జపాన్ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో గుర్తించారు. పండ్లను తెగుళ్లు, కీటకాల నుంచి రక్షించడానికి ఈ ప్రక్రియ చాలా కీలకం. ఈ నేపథ్యంలో మార్చి 2 తర్వాత జారీ చేసిన భారతీయ సర్టిఫికెట్లతో వచ్చే మామిడి షిప్‌మెంట్‌లను అంగీకరించబోమని జపాన్‌కు చెందిన యొకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ స్పష్టంచేసింది.
ఈ నిషేధం కారణంగా కేసర్, అల్ఫాన్సో, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రసిద్ధ రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. భారత మామిడి ఎగుమతిదారులు ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఎగుమతులు 20-30 శాతం పడిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడంతోపాటు కంటైనర్ల కొరత కూడా వేధిస్తోంది. మరోవైపు దేశంలో తీవ్రమైన వడగాడ్పులవల్ల పంట దిగుబడి తగ్గింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జపాన్ నిషేధం వారిని మరింత కుంగదీసింది.
1986 నుంచి 2006 వరకు కూడా పండ్ల ఈగల కారణంగా జపాన్ భారత మామిడిపై నిషేధం విధించింది. వీహెచ్‌టీ ప్రక్రియను అమలు చేశాకే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం జపాన్‌తో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ సీజన్‌లో ఎగుమతులు తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు.

More Stories
రూపాయి మారకం రేటు పతనాన్ని ఆర్బీఐ అడ్డుకోవద్దు
ప్రాంతీయ పార్టీలలో టిడిపికే అత్యధికంగా ఆదాయం
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు అనుమతి