రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బిజెపి చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రలో బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు రెండో రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌తో పాటు, వడపర్తి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్రలో మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్, వెంకట రమణా రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తాను చూపే కొనుగోలు కేంద్రాలకు రావాలని, నెల రోజులుగా రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూడాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో వరితో పాటు జొన్నలు, సన్‌ఫ్లవర్ పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, శనగల కొనుగోలు ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్లు, ఏఎంసీ మార్కెట్లలో రైతులు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్దే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాపలా కాస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం గింజలు జోకడానికి గంపలు, సంచులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని, మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు (మాన్సూన్) ప్రారంభం కానున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, మద్దతు ధర కల్పిస్తాం’ అని నాడు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి, నేడు రైతులను ఎందుకు వంచించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళాల బాట పట్టడంతోనే భయంతో అప్పటికప్పుడు లారీలను పంపుతున్నారని ఎద్దేవా చేశారు. గత 40 రోజులుగా నిద్రపోయిన యంత్రాంగం తాము వస్తుంటేనే లారీలు పంపడం వారి వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తమ రాకతోనే లారీలు వస్తాయంటే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి, రైతుల పక్షాన నిలబడడానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

More Stories
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
మజ్లిస్ కనుసన్నల్లో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
మేడ్చల్ జాయీద్ ఖాన్ వద్ద యూపీ మంత్రుల సెల్‌ఫోన్ నంబర్లు!