భారత్- సైప్రస్ భాగస్వామ్యం మరింత బలోపేతం

భారత్- సైప్రస్ భాగస్వామ్యం మరింత బలోపేతం
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.  భారత్, సైప్రస్‌లు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. భారత్, సైప్రస్‌ అనుబంధం కాలపరీక్షలో పదేపదే నిలుస్తూ వచ్చిందని ఆయన తెలిపారు. 
 
గత దశాబ్ద కాలంలో భారత్‌లోకి సైప్రస్ పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని, ఇది ఇరుదేశాల మధ్య పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవలె భారత్- యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది రాబోయే రోజుల్లో భారత్ – సైప్రస్‌లకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
దీని ఊతంతో రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ఇరుదేశాలు పెట్టుకున్నాయని చెప్పారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తుందని, అనేక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
వచ్చే ఏడాదికి భారత్-సైప్రస్ దౌత్య సంబంధాలు 65 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత దూకుడుగా మారడానికి ఈ సమావేశం కీలకమైన ముందడుగు అని విదేశాంగ శాఖ తెలిపింది.  ఉమ్మడి విలువలు, బలమైన ప్రజల మధ్య సంబంధాలతో కాలపరీక్షకు నిలిచిన సన్నిహిత సంబంధాలను భారత్- సైప్రస్ పంచుకుంటున్నాయని పేర్కొంది. 
 
అలాగే, భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ద్వైపాక్షిక సమావేశం దోహదపడుతుందని పేర్కొంది. సైప్రస్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల భారత పర్యటన కోసం ఈ నెల 20న స్రైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ముందుగా ముంబయికి చేరుకున్నారు.