`నీట్ లీక్’లో ముగ్గురు పూనా మహిళలు `మనీషా’లు అరెస్ట్! 

`నీట్ లీక్’లో ముగ్గురు పూనా మహిళలు `మనీషా’లు అరెస్ట్! 
దేశవ్యాప్త నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నియమించిన ఒక నిపుణురాలిని సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఫిజిక్స్ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు మనీషా సంజయ్ హవల్దార్‌ను నిందితురాలిగా గుర్తించారు. 
 
మనీషా సంజయ్ హవల్దార్ ప్రస్తుతం పూణేలోని సేథ్ హీరాలాల్ సరఫ్ ప్రశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు మహిళలు కూడా `మనీషా’లే కావడం గమనార్హం.  నీట్ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి ఎన్‌టీఏ ఆమెను సబ్జెక్ట్ నిపుణురాలిగా నియమించింది.  హవల్దార్‌కు ఫిజిక్స్ ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ ఉంది.
ఆమె పేపర్ లీక్‌కు సంబంధించి అరెస్టు చేసిన వృక్షశాస్త్ర లెక్చరర్ మనీషా మంధారేతో అనేక ఫిజిక్స్ ప్రశ్నలను పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హవల్దార్ పంచుకున్న ప్రశ్నలను, నీట్-యూజీ 2026 ఫిజిక్స్ పరీక్ష పేపర్ సెట్లలో వచ్చిన ప్రశ్నలతో సరిపోల్చి చూసినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు.  పూణేలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన జీవశాస్త్ర నిపుణురాలు మంధారే మే 16న అరెస్టు అయ్యారు.
ఆమెకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నపత్రాలపై పూర్తి అవగాహన ఉంది. ఆమె మరో నిందితురాలైన మనీషా వాఘ్మారే ద్వారా నీట్ పరీక్ష రాయబోయే అభ్యర్థులను సమీకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.  పూణేకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్ అయిన వాఘ్మారే, నీట్ ఆశావహులను ప్రతిష్టాత్మక పాఠశాలల ఉపాధ్యాయులతో అనుసంధానించినట్లు వెల్లడి కావడంతో మే 14న అరెస్టు అయ్యారు.  
 
పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత, మే 7 సాయంత్రం ఈ అవకతవకలకు సంబంధించి ఎన్‌టీఏకు సమాచారం అందింది. మంధారేతో పాటు, పదవీ విరమణ చేసిన రసాయనశాస్త్ర అధ్యాపకుడు పి.వి. కులకర్ణి కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. వీరిద్దరికీ వాఘ్మారే ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రత్యేక తరగతుల కోసం నీట్ ఆశావహులను తీసుకురావడానికి ఈ ఇద్దరు అధ్యాపకులు వాఘ్మారేను ఉపయోగించుకున్నారు. 
 
సమాచారం లీక్ అయిన నేపథ్యంలో, జూన్ 21న జరగనున్న పునఃపరీక్షను “సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, పకడ్బందీగా” నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను కోరారు. ఎలాంటి అవకతవకలను నివారించేందుకు, వచ్చే ఏడాది నుంచి వైద్య ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.