వామపక్ష మేధావి, మాజీ ఎమ్యెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానల్ డిబేట్ షోలో పాల్గొన్న నాగేశ్వర్ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై నాగేశ్వర్ అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని, ఆ సమయంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని వారిపై ఒత్తిడి వస్తుందని చెప్పినట్టు తెలిపారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ రాజకీయాల్లో చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు, కానీ జగన్ శాశ్వత మిత్రుడు..చంద్రబాబుకు జగన్‌తో శత్రుత్వం ఉండొచ్చు కానీ, మనకెందుకు? అని అన్నట్టు జనసేన కోర్ కమిటీ సమావేశం ద్వారా తనకు సమాచారం అందినట్టు నాగేశ్వర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. ఈ వాఖ్యలు ప్రసారం చేసిన టివి ఛానల్, ఆ కార్యక్రమం నడిపిన జర్నలిస్టు పైన కూడా ఫిర్యాదు చేశారు. ఈ కధనాన్ని పోస్ట్ చేసిన ఓ వెబ్ సిట్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
జనసేన శ్రేణులు నాగేశ్వర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నమే ఇది అని ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా నాగేశ్వర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ, ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం, సర్పవరం, అలాగే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు నాగేశ్వర్‌పై ఫిర్యాదులు చేశారు.
ఈ పరిణామాలు వేగంగా మారడంతో నాగేశ్వర్ చివరకు తాను చేసిన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. జనసేన నేతలు మాత్రం రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీపై తరచూ విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ విమర్శించారు. మేధావిగా నాగేశ్వర్‌పై గౌరవం ఉన్నప్పటికీ, జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంటూ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
దేశంలో కనీసం మరో 20 ఏళ్లు బిజెపిదే రాజకీయ ఆధిపత్యం
సందేశ్‌ఖాలిలో కిరాతకంపై తిరగబడ్డ రేఖా పాత్ర
ఇకపై బెంగాల్ మద్రాసాలలో కూడా వందేమాతరం తప్పనిసరి