తెలంగాణ మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 8 పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్సెస్ యాక్ట్) కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ రాష్ట్రంలో ఏకంగా 2,799 పోక్సో కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 8 మందికి పైగా మైనర్ బాలికలపై ఏదోవిధంగా లైంగిక దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 నెలల వ్యవధిలో 409 పోక్సో కేసులు నమోదవగా వాటిలో 385 మంది నిందితులు (94 శాతం) బాధితులకు తెలిసినవారేనని భరోసా కేంద్రం అధికారుల సర్వేలో బయటపడింది. వారిలో అత్యధికంగా 65 శాతం మంది స్నేహితులు కాగా, 11 శాతం ఇంటి చుట్టుపక్కలవారు, 8 శాతం మంది దగ్గరి బంధువులు ఉన్నారు.
4 శాతం మందిలో పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు, చాక్లెట్ల వంటి తినుబండారాలు అమ్మే కిరాణా షాపుల యజమానులు, అపార్టుమెంట్లలో ఉండే వాచ్‌మెన్ ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా స్నేహం విషయంలో మైనర్లు మరింత జాగ్రత్తగా వ్యవహారించాలని, ఆ మేరకు తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా తెలిసీ తెలియని వయసులోని పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా పిల్లలకు ధైర్యం చెబుతూ పూర్తి వివరాలు ఆరా తీయాలని స్పష్టంగా సూచనలు చేస్తున్నారు. బంధువులు, చుట్టుపక్కలవారు పిల్లలతో ప్రవర్తించే విధానంపైనా వారికి తెలియకుండా కన్నేసి ఉంచాలని అధికారులు కోరుతున్నారు.
చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే పోలీసులకు సరిగా చెప్పుకోలేరన్న ఉద్దేశంతో తొలుత భరోసా కేంద్రాల్లోని ఎక్స్పర్ట్స్ వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. వారికి జరిగిన నేరం తీరును అధ్యయనం చేసి మెడికల్ పరంగా సాయం అందివ్వడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2025 జూన్ నుంచి 2026 ఏప్రిల్ వరకూ భరోసా కేంద్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే 2,799 పోక్సో కేసులు నమోదవడం గమనార్హం. నిందితులకు శిక్ష పడే వరకూ భరోసా కేంద్రాలు బాధితులకు ధైర్యంగా, అండగా ఉంటాయి.

More Stories
తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ
కేబీర్ పార్క్ చుట్టూరా చెట్ల నరికివేతపై సుప్రీం ఆంక్షలు!
ప్రధానిగా 12వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణం, ఇంధన పొదుపు!