దేశంలో రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి రావడానికి, తొలి సాధారణ ఎన్నికలు జరగడానికి ముందే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభించిందని, అదే చివరకు దేశ విభజనకు కారణమైందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. గోరఖ్‌పుర్ సమీపంలోని టెనువా టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన బీజేపీ జిల్లా శిక్షణ శిబిర ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దేశ రాజ్యాంగం 1949 నవంబర్ 26న రూపుదిద్దుకుని, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.
అదే సమయంలో దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైందని, రాజ్యాంగం పూర్తిగా అమలు కాకముందే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని, అదే దేశ విభజనకు దారితీసిందని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత భవిష్యత్తు కోసం పనిచేసే రాజకీయ పార్టీ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావించిందని, నంతరం కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని, తర్వాత దీన్‌దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ సిద్ధాంతాలు, విలువలను ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జనసంఘ్ జనతా పార్టీలో విలీనం అయిందని యోగి చెప్పారు. అయితే అనేక కారణాల వల్ల జనతా పార్టీ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని చెప్పారు.
1980లో భారత జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భవించినప్పుడు జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పార్టీకి కేవలం రెండు స్థానాలే గెలుచుకుందని గుర్తు చేశారు. అనంతరం 1986లో అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో భవ్య రామ మందిర నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని పేర్కొంటూ దేశంలో సాంస్కృతిక జాతీయతను స్థాపించడమే ఆ నిర్ణయం వెనుక లక్ష్యమని చెప్పారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తైందని చెబుతూ అయోధ్య రామాలయం కేవలం దేవాలయం మాత్రమే కాదని, అది ‘రాష్ట్ర మందిరం’ అని అభివర్ణించారు. శతాబ్దాల పాటు ఆక్రమణదారుల చేత అణచివేతకు గురైన భారతీయ నాగరికత, సంస్కృతికి ఈ రామ మందిరం కొత్త ఆశలు నింపిందని యోగి తెలిపారు. “500 ఏళ్ల తర్వాత భారత్ ఈ కలను సాకారం చేసుకోగలిగితే, ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురైన సమాజాలు కూడా తమ లక్ష్యాలను సాధించగలవు” అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా భారత్ ప్రపంచానికి కొత్త ఆశాకిరణం చూపిందని, విశ్వాసాన్ని గౌరవించే సందేశాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అలాగే, లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, స్పల్వ కాలంలోనే బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని చెప్పారు. బీజేపీ తన సొంత బలం, సామర్థ్యంపై ఆధారపడి పలు రాష్ట్రాల్లోని పరిపాలన ద్వారా తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ‘దేశమే ప్రథమం, పార్టీ రెండోది, వ్యక్తి చివరివాడు’ అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా దృఢంగా సమర్థించిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని తెలిపారు.
“రాజకీయాల్లో విలువలు, ఆదర్శాల గురించి చర్చ జరిగిన ప్రతీసారి లేదా భారతీయ మూలాలున్న ప్రజలు నివసించే ఏ ప్రాంతంలో గానీ జాతీయవాదం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా, నిస్సందేహంగా గుర్తుకువచ్చే ఒకే ఒక ముఖం బీజేపీ జాతీయ నాయకత్వానిదే. వారి కళ్ల ముందు ఒక చిహ్నం ఆవిష్కృతమైతే, అది కమలమే అవుతుంది” అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

More Stories
బెంగాల్లో వేగంగా అడుగులు వేస్తున్న సువెందు ప్రభుత్వం
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్
ఐదేళ్లలో తైవాన్ పై చైనా దాడి .. అమెరికా భయం!