నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో బయాలజీ లెక్చరర్ మనీషా అరెస్ట్

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో బయాలజీ లెక్చరర్ మనీషా అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్‌- యూజీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో  సీబీఐ మరో కీలక నిందితురాలు మహారాష్ట్రలోని పుణెకు చెందిన సీనియర్‌ బయాలజీ లెక్చరర్‌ మనీశా గురునాథ్‌ మందరేను డిల్లీలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆమె నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసిన నీట్‌ ప్రశ్నాపత్ర రూపకల్పన కమిటీలో సభ్యురాలిగా పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. 

సీబీఐ దర్యాప్తు ప్రకారం,  పూణేలో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న, నీట్‌ లీక్‌ కేసులో మే 14న అరెస్టైన మనీషా వాఘ్మారేను ఏప్రిల్‌లో ఆమె సంప్రదించింది. ఆమె ద్వారా నీట్‌ పరీక్ష రాయబోయే అభ్యర్థులను సమీకరించింది. పూణేలోని తన నివాసంలో ఆ విద్యార్థులకు కోచింగ్ క్లాస్‌లు నిర్వహించింది.  తన వద్ద కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులకు నీట్‌ పేపర్‌ను లీక్‌ చేసింది. బోటనీ, జువాలజీకి సంబంధించిన ప్రశ్నలను నోట్‌బుక్‌లో రాసుకోవాలని వారికి చెప్పింది.

అలాగే టెక్ట్‌బుక్స్‌లో మార్క్‌ చేసుకోమని సూచించింది. మే 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్షలో లీకైన ఈ బోటనీ, బయోలజీ ప్రశ్నలు అధిక శాతం సరిపోలినట్లు సీబీఐ అధికారి తెలిపారు.  ఈ కోచింగ్‌ తరగతులకు హాజరైన విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కెమిస్ట్రీ నిపుణుడు ప్రొఫెసర్‌ పీవీ కులకర్ణి విచారణలో బయటపడిన వివరాల ఆధారంగానే మనీశా మందరే అరెస్టు జరిగినట్లు సమాచారం.

లాతూర్‌కు చెందిన కులకర్ణి కూడా గతంలో ఎన్నో సంవత్సరాలుగా నీట్‌ ప్రశ్నాపత్రాల రూపకల్పనకు సంబంధించిన కమిటీల్లో పనిచేసినట్లు సీబీఐ వెల్లడించింది.   సీబీఐ ప్రకారం, కులకర్ణి కూడా ఏప్రిల్‌ చివరి వారంలో తన ఇంట్లో ప్రత్యేక కోచింగ్‌ తరగతులు నిర్వహించి ప్రశ్నలు, ఆప్షన్లు, సమాధానాలను విద్యార్థులకు చెప్పినట్లు గుర్తించారు.  నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహల్యానగర్‌కు చెందిన 9 మందిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. 

దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సోదాలు నిర్వహించడంతోపాటు పలు పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నది. నీట్‌ యూజీ ప్రశ్నపత్రాన్ని రూపొందించిన ఎన్టీఏ కమిటీలోని ఇతర సభ్యులు, సీనియర్ అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు.