తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంపై పాకిస్థాన్‌ను సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం తీవ్రంగా హెచ్చరించారు. ఆ పొరుగు దేశం “భౌగోళికంలో భాగం కావాలనుకుంటుందా లేక చరిత్రలో కలిసిపోవాలనుకుంటుందా” అని నిర్ణయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ మొదటి వార్షికోత్సవాన్ని భారతదేశం జరుపుకున్న కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దిల్లీలోని మాకెన్ షా సెంటర్లో ‘యూనిఫామ్ అన్వీల్డ్’ నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ సెషన్లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొంటూ గతేడాది ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తితే భారత సైన్యం ఎలా స్పందిస్తుందని ఆయనను ప్రశ్నించగా ధీటుగా బదులిచ్చారు. ఉంటుందన్నారు. చరిత్రలో ఆ దేశానికి స్థానం ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషించరాదని తేల్చి చెప్పారు.
“నేను ఇంతకుముందు చెప్పిన మాటలను మీరు విని ఉంటే… పాకిస్తాన్ గనుక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే, అప్పుడు వారు భౌగోళిక చిత్రపటంలో (వర్తమానంలో) కొనసాగాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది,” అని సైన్యాధిపతి పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీకీ వెళ్లదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపాలని ఆయన పాక్‌ను హెచ్చరించారు. గతంలోనూ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ ఆర్మీ చీఫ్ ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని కొనియాడారు.
భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్ధత ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను చాలా కచ్చితత్వంతో అమలు చేశామని చెప్పారు. 88 గంటల పాటు సాగిన ఆ ఆపరేషన్‌లో భారత త్రివిధ దళాలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని గుర్తు చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయగలిగామని పేర్కొన్నారు. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చామని వెల్లడించారు.
ఆ సమయంలో పెద్దఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించామని వివరించారు. పాకిస్థాన్ చిన్న తప్పు చేసినా భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా అప్పట్లో తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. `భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ పౌరుల రక్షణ, శ్రేయస్సు విషయంలో రాజీ పడదు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుంది’ అని ద్వివేది తేల్చి చెప్పారు.

More Stories
హైకోర్టు తీర్పుతో భోజ్‌శాల సముదాయంలో విశేషంగా పూజలు!
సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్
నీట్ పేపర్ లీక్ కేసులో బయాలజీ లెక్చరర్ మనీషా అరెస్ట్