* భారత్ చాబహార్ ఓడరేవు అభివృద్ధి కొనసాగిస్తుందని ఆశాభావం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు దైపాక్షిక, దౌత్యపరమైన చర్చలు మాత్రమే మార్గం అని అబ్బాస్ స్పష్టం చేశారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు భారత్ ఎలాంటి నిర్మాణాత్మక ప్రతిపాదనతో వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు.
ప్రాంతీయ శాంతి భద్రతల్ని ప్రభావితం చేసే శక్తి భారత్ కు ఉందని ఆయన పేర్కొంటూ ఈ విషయంలో భారత్ అర్థవంతమైన ప్రతిపాదనతో వస్తే మద్దతు తెలుపుతామని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్దానికి సైనిక చర్య ఎంతమాత్రం పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. హార్ముజ్ వద్ద పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అయితే, ఇక్కడి నుంచి నౌకలు సురక్షితంగా కదిలేందుకు ఎలాంటి సాయం అందించడానికైనా ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
తన దేశంలోని చాబహార్ ఓడరేవును “స్వర్ణ ద్వారం”, “సహకారానికి ప్రతీక”గా అభివర్ణిస్తూ, భారతదేశం ఈ వ్యూహాత్మక ఓడరేవును అభివృద్ధి చేయడం కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అరాఘ్చి మాట్లాడుతూ, “చాబహార్ ఇరాన్, భారతదేశం మధ్య సహకారానికి ప్రతీక. ఆ ఓడరేవు అభివృద్ధిలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పుడు దాని వేగం కొంత తగ్గింది. కానీ ఈ రవాణా మార్గం ద్వారా భారతదేశం మధ్య ఆసియాకు, ఆపై ఐరోపాకు చేరుకోవడానికి ఈ ఓడరేవు ఒక స్వర్ణ ద్వారంలా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను” అని తెలిపారు.
అలాగే ఐరోపా, మధ్య ఆసియా దేశాలు, ఇతరులు హిందూ మహాసముద్రాన్ని చేరుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. “ఇది మాకు, భారతదేశానికి, అనేక ఇతర దేశాలకు ముఖ్యమైన, అత్యంత వ్యూహాత్మక ఓడరేవు. కాబట్టి, చాబహార్ ఓడరేవులో భారతీయులు తమ పనిని కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను.తద్వారా ఇది భారతదేశం,చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాల ప్రయోజనాలకు సేవ చేసే విధంగా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది” అని తెలిపారు.
అమెరికాపై విశ్వాసం లేకపోవడం వల్లే చర్చలు పురోగతి సాధించడం లేదని తేల్చి చెప్పారు. అమెరికాను తాము నమ్మకపోవడానికి పలు కారణాలున్నాయని, అయితే, అమెరికాకు మాత్రం ఇరాన్‌పై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. 40 రోజుల యుద్దం తర్వాత కూడా అమెరికా ఎలాంటి లక్ష్యాన్ని సాధించలేదని, అందుకే ఇరాన్‌తో చర్చలకు ప్రతిపాదించారని గుర్తు చేశారు.
అయితే, తమకు అమెరికన్లపై నమ్మకం లేదని అబ్బాస్ అరాగ్చీ చెప్పుకొచ్చారు. అమెరికాతో దౌత్యపరంగా ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ దౌత్యచర్యలు విఫలం కాలేదని, కానీ, అమెరికా వైఖరి సరిగ్గా లేకపోవడం వల్ల ఆ దేశంపై విశ్వాసం లేదని చెప్పారు.
“40 రోజులపాటు యుద్ధం చేసిన తర్వాత కూడా ఇరాన్‌లోని ఏ లక్ష్యాన్ని అమెరికా సాధించలేకపోయింది. దీంతో అమెరికా నిరాశ చెందింది. అప్పుడు మాతో చర్చలకు ముందుకు వచ్చింది. మాకు అమెరికన్లపై నమ్మకం లేదు. ఏ దౌత్య ప్రయత్నానికైనా అమెరికానే ప్రధాన అడ్డంకి. అమెరికన్లను నమ్మకపోవడానికి మాకు అన్ని కారణాలూ ఉన్నాయి. కానీ మమ్మల్ని నమ్మకపోవడానికి వారికి ఎలాంటి కారణమూ లేదు” అని తెలిపారు.
“ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చాలా బలహీనమైన కాల్పుల విరమణ కొనసాగుతోంది. దౌత్యానికి ఒక అవకాశం ఇవ్వడానికి మేము కాల్పుల విరమణను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇరాన్‌కు సంబంధించిన దేనికీ సైనిక పరిష్కారం లేదు. అమెరికన్లు మమ్మల్ని పదేపదే పరీక్షించారు. మేము ఏ ఒత్తిడికి లేదా బెదిరింపులకు తలొగ్గం. మేము ఏ బెదిరింపులనైనా ప్రతిఘటిస్తాం. ఇరాన్ సహనాన్ని లొంగిపోవడంగా పొరపాటు పడకూడదు” అని అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
ఈ విషయంలో తమకు చైనా సహకరించినా స్వాగతిస్తామని చెప్పారు. గతంలో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మెరుగుపర్చడంలో చైనా సాయం చేసిందని గుర్తు చేశారు.
More Stories
అయోధ్య తీర్పు ఆధారంగానే భోజ్‌శాల సముదాయంపై తీర్పు!
చైనాకు ఆందోళన కలిగిస్తున్న భారత్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్
భారత్‌కు రూ.47 వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన యూఏఈ