ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ఈ సందర్భంగా అబుదాబి విమానాశ్రయానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా వచ్చిన మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలలో రక్షణ సహా కీలక ఒప్పందాలు కుదిరాయి.
భారత్‌లో 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 47 వేల కోట్లు) పెట్టుబడులకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ పర్యటన ఆరంభం నుంచే స్పష్టమైన వ్యూహాత్మక ధోరణిని మోదీ ప్రదర్శించారు. ఇటీవల యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలిపారు. హర్మూజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి భారత్ సహాకారం ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.
ప్రాంతీయ స్థిరత్వానికి, శాంతికి, ప్రపంచ ఇంధన, ఆహార భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. మోదీ చర్చల ఎజెండాలో ఇంధన భద్రతకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతోపాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యూఏఈతో ఎంవోయూతో ఒప్పందం చేసుకున్నారు.
భవిష్యత్తులో సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో ఎమిరేట్స్ ఎన్బీడీ భారత్‌లోని ఆర్బీఎల్ బ్యాంకులో 3 బిలియన్ డాలర్లు, భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒక బిలియన్ డాలర్లు, సమ్మాన్ క్యాపిటల్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై కూడా సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోనున్నారు. ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతపై సహకారం, శిక్షణ, సంయుక్త విన్యాసాలు, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ, సురక్షిత కమ్యూనికేషన్లు, సమాచార మార్పిడి బలోపేతం కానుంది. అలాగే, సీడాక్, యూఏఈకి చెందిన జీ-42 భాగస్వామ్యంతో 8 ఎక్సాఫ్లాప్ సూపర్ కంప్యూట్ క్లస్టర్ ఏర్పాటు, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, దుబాయ్‌కు చెందిన డ్రైడాక్స్ వరల్డ్‌తో రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
యుఎఇ అధ్యక్షునితో జరిగిన భేటీలో పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై ఇరుదేశాధినేతలు చర్చించారు. అలాగే, యూఏఈలో నివసిస్తున్న 45లక్షల మంది భారతీయుల భద్రతపై చర్చలు జరిపారు.
”పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంది. అయితే, భారత్ ఎప్పుడూ చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుంది. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలి. అదేవిధంగా హర్మూజ్‌పై అంతా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలి. అలాగే, ఇరాన్, యూఏఈని లక్ష్యంగా చేసుకున్న తీరు ఆమోదయోగ్యం కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితిని యుఎఇ సంయమనంతో ఎదుర్కోవడం ప్రశంసనీయం. భారత్ ఎప్పుడూ యూఏఈతో చేతిలో చేయి వేసే నడిచింది. యూఏఈతో భారత్ అనుబంధం ఇకముందూ కొనసాగుతుంది.” అని ప్రధాని మోదీ చెప్పారు.

More Stories
అయోధ్య తీర్పు ఆధారంగానే భోజ్‌శాల సముదాయంపై తీర్పు!
చైనాకు ఆందోళన కలిగిస్తున్న భారత్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్
అమెరికన్లను నమ్మలేం.. శాంతి కోసం భారత్ కీలక పాత్ర పోషించాలి