బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
 
పశ్చిమ బెంగాల్ నేడు ఒక కొత్త రాజకీయ శకంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి బీజేపీ నాయకుడైన సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్లుగా బెంగాల్ అంటే మమతా బెనర్జీయే; ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి బీజేపీ వైపు చూసింది.  అధికారి మంత్రివర్గంలో దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తోనియా, క్షుదీరామ్ టుడు, నిసిత్ ప్రమణిక్ అనే ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.  ఈ పరేడ్ గ్రౌండ్ ఎప్పటినుంచో భారీ ర్యాలీల ద్వారా బెంగాల్ రాజకీయ రంగానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. 
 
ఈ కార్యక్రమం కోసం బీజేపీ, రవీంద్రనాథ్ టాగోర్ జన్మదినమైన రవీంద్ర జయంతి మే 9వ తేదీని ఎంచుకుంది. బీజేపీని ఎన్నుకున్న ఓటర్లకు ఇది ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఒక సాంస్కృతిక సంకేతం. ప్రమాణస్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్‌ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు.  ఈ క్రమంలో వేదికపై ఉన్న బిజేపీ అత్యంత సీనియర్ కార్యకర్తలలో ఒకరైన మఖన్‌లాల్ సర్కార్‌ను ప్రధాని మోదీ సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు పలువురు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్యప్రదర్శన చేశారు. మరికొందరు సంగీత వాయిద్యాలతో అలరించారు.

బెంగాల్​లో సోనార్ బంగ్లా యుగానికి అధికారికంగా శ్రీకారం చుట్టామని తెలుపుతూ ప్రమాణ స్వీకారానికి ముందు సవేందుకు అధికారి ఎక్స్​లో పోస్ట్ చేశారు. “బెంగాల్​కు ఇది చారిత్రాత్మక ఉదయం. విజనరీ నాయకుడు ప్రధాని మోదీ మోదీని సిటీ ఆఫ్ జాయ్‌కు స్వాగతించడం గర్వకారణం. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్​లో తొలి బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుండటం ద్వారా మన స్థాపకుల కలలను సాకారం చేస్తున్నాం” అని తెలిపారు. 

“రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన దుర్వినియోగ పాలనకు నేటితో ముగింపు పలుకుతున్నాం. ఇక నుంచి అభివృద్ధి, శాంతి, సుసంపన్నత లక్ష్యంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది సోనార్ బంగ్లా యుగానికి అధికారిక ఆరంభం” అని సువేందు అధికారి ఎక్స్​లో రాసుకొచ్చారు.