బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం 

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం 
తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి బెంగాల్‌లో తొలి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. తన రాజకీయ గురువు మమతా బెనర్జీపైనే ఘనవిజయం సాధించిన సువేందు అధికారిని బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభాపక్షనేతగా శనివారం ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయి సువేందు అధికారిని పేరు ఖరారుచేశారు. 

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ హక్కును కోరుతూ, అధికారి సాయంత్రం 6:30 గంటలకు బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవితో భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సువేందు అధికారిని బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అమిత్ షా, ‘సోనార్ బంగ్లా’ కలను సాకారం చేయడానికి కొత్త ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలను ఓడించి తమకు అధికారం కట్టబెట్టిన బెంగాల్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనేక హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగినప్పటికీ, బెంగాల్ ఎన్నికలలో ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని ఆయన గుర్తు చేశారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చొరబాట్లు, గోవుల అక్రమ రవాణా అసాధ్యమవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రమాణస్వీకారానికి యంత్రాంగం అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహిళా నేత అగ్నిమిత్ర పాల్‌కు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రిగా ఆమె ఎంపికైతే బంగాల్ తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు.

రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని ఉత్తర  బెంగాల్‌కు కేటాయించే అవకాశం ఉంది.  సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అమిత్ షా ఇప్పటికే అగ్నిమిత్ర పాల్, శంకర్ ఘోష్‌లతో విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. జ్యోతిబసు ప్రభుత్వంలో బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బెంగాల్‌లో ఉప ముఖ్యమంత్రుల వ్యవస్థ రాబోతోంది.

పశ్చిమ  బెంగాల్‌లో 15 ఏళ్ల మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చడంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగిన సువేందు ఆరేళ్ల కిందట అనూహ్యంగా తృణమూల్‌ను వీడారు. ఇప్పుడు తన మాజీ గురువు మమతా బెనర్జీ స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.  బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఈ సారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో భవానీపూర్‌లోనూ ఓడించారు.

బెంగాల్‌లో బీజేపీకి 207 సీట్లు రావడంలోకీలక పాత్ర పోషించారు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లా కాంతిలో జన్మించారు.  ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచీ వాటిని బాగా వంటబట్టించుకున్నారు. సువేందు అధికారి తండ్రి శిశిర్‌ అధికారి మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరులు కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 

సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ద్వారా ప్రారంభించారు.  1995లో కాంగ్రెస్‌ తరఫున కాంథీ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంథీ దక్షిణ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2004లో తమలుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో అదే తమలుక్ స్థానం నుంచే ఎంపీగా గెలుపొందారు.

సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్‌ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్‌లో వేలాది ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములు కాపాడటానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు. దీదీ నేతృత్వంలోబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో సఫలీకృతమయ్యారు. 

నందిగ్రామ్‌తోపాటు సింగూర్‌ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు. కాలక్రమేణా మమతా బెనర్జీతో సువేందు అధికారికి విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడారు. అదే ఏడాది అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు.