15 ఏళ్ల టీఎంసీ పాలనకు బీజేపీ ఘనవిజయంతో తెరదించిన అనంతరం, ఎన్నికల హింసతో అట్టుడికిపోతున్న పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి, బుధవారం రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లోని దోహరియా ప్రాంతంలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి కార్యనిర్వహణ సహాయకారి (పిఎ) చంద్రనాథ్ రథ్‌ను కాల్చి చంపడంతో మరింత తీవ్రరూపం దాల్చింది.ఇది ముమ్మాటికీ తృణమూల్ కాంగ్రెస్ పనేనని బీజేపీ ఆరోపిస్తుంది.
ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న అధికారికి అత్యంత సన్నిహితుడైన రథ్‌ను, రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు ఆయన కారును అడ్డగించి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో, అతడిని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని దుండగుడు ఒకరు చంద్రనాథ్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారని ప్రత్యక్షసాక్షి చెప్పారు. “ఈ ఘటన రాత్రి 10. 30 – 11 గంటల మధ్య జరిగింది. అదే సమయంలో చంద్రనాథ్ కారు, నా వాహనాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్లింది. 100 మీటర్లు ముందుకు వెళ్లగానే ఆ కారు సడెన్‌గా ఆగింది. బైక్‌పై ఆ కారును వెంబడించిన ఓ వ్యక్తి ముందుకు వెళ్లి ఆగాడు. ఎదురుగా నిలబడి కారుకు ఎడమ వైపున కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. నాకు రెండు రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. ఒక్కడే వచ్చి, అతి దగ్గర్నుంచి కాల్చులు జరిపాడు. వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు. అతడు సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. హెల్మెచ్ ధరించి ఉండడం వల్ల ఫేస్ కనిపించలేదు. అతడు షూటింగ్లో ఎక్స్పర్ట్లాగా ఉన్నాడు. స్థానికులు గమనించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇదైతే ప్లాన్‌తోనే చేసిన హత్యలాగా నాకు అనిపిస్తుంది” అని ప్రత్యక్షసాక్షి చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రాష్ట్ర డీజీపీ సిద్ధనాథ్ గుప్తా తెలిపారు. ఘటనాస్థలం నుంచి తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే దాడికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఒక కారును సీజ్ చేసినట్లు డీజీపీ తెలిపారు. ‘దుండగులు దాడికి ఒక కారును కూడా వాడినట్లు గుర్తించాం. ఆ కారును సీజ్ చేశాం. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ సిలిగుఢి ప్రాంతీయ రవాణా కార్యాలయానికి చెందినదిగా ఉంది. కానీ నంబర్ ప్లేట్‌ను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. నిందితులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందాలు వాహనం నుంచి నమూనాలను సేకరించాయి. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ప్రత్యక్షసాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తు చేపట్టాం’ అని డీజీపీ తెలిపారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, రథ్ బరసత్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా, దోహరియా ప్రాంతంలో ఒకటి లేదా రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు ఆయన కారును ఆపారు. వారిలో ఒక వ్యక్తి కారు కిటికీ దగ్గరకు వచ్చి ఆయనపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రథ్ డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్నాడు. ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఒక సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. ఎందుకంటే, రథ్‌ను కాల్చిన తర్వాత, హంతకుడు అతను చనిపోయే వరకు వేచి చూశాడు. రథ్‌ను వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి ఇద్దరిని తీసుకువచ్చారని వైద్యులలో ఒకరు తెలిపారు. వారిలో ఒకరు అప్పటికే మరణించి ఉండగా, మరొకరికి తుపాకీ గాయాలయ్యాయని ఆ డాక్టర్ చెప్పారు.
దాడి గురించి తెలియగానే సువెందు అధికారి, రథ్ భార్య ఆసుపత్రికి బయలుదేరారు. దాడికి ముందు దుండగులు రెక్కీ నిర్వహించారని అధికారి ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. “మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము, ఈ ఘటనను ఖండించడానికి మాకు మాటలు రావడం లేదు. ఢిల్లీలోని మా నాయకత్వం మొత్తం దీని గురించి సమాచారం తీసుకుంది. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మృతుని కుటుంబంతో, పోలీసులతో మాట్లాడారు,” అని అధికారి పేర్కొన్నారు. “పోలీసులు కొన్ని ఆధారాలు కనుగొన్నారు, వారు దర్యాప్తు చేస్తారు,” అని ఆయన తెలిపారు.
ఈ హత్యకు సంబంధించి తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లతో మాట్లాడినట్లు కూడా ఆయన చెప్పారు. “ఇది 15 ఏళ్ల మహా జంగల్ రాజ్ ఫలితం… ఇక్కడి గూండాలపై బీజేపీ ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.” ఈ ఘటనకు అధికారి ఏ సంస్థనూ నిందించకపోయినప్పటికీ, ఆయన పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఎంసీని నిందించారు.
తాము అధికారంలో లేకపోయినా, తమను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన శక్తిగా భావించవచ్చనే సందేశాన్ని ప్రజలకు పంపాలనే ఉద్దేశంతో, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ హత్యను చేయించారని బీజేపీ నాయకుడు అర్జున్ సింగ్ ఆరోపించారు. బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ కూడా ఈ దాడిని టీఎంసీకి ముడిపెడుతూ, భవానిపూర్‌లో బెనర్జీ ఓటమి ఫలితమే ఇది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, బాధితుని కుటుంబానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ, “ఇది ఊహించినదే. వాళ్ళు ఎంత నీచానికి దిగజారగలరు? ప్రభుత్వం కూలిపోగానే గవర్నర్ బాధ్యత తీసుకోవాలని నేను ముందే చెప్పాను. టీఎంసీ… సువేందు అధికారి పీఏను హత్య చేసేంత నీచానికి దిగజారింది. గతంలో, వారు సువేందు, దిలీప్ ఘోష్ తదితరులతో సహా మా నాయకులపై దాడి చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆయన తల్లి కూడా మా పార్టీలోనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి పీఏను హత్య చేయడం ఒక సందేశం. ప్రజలే నిర్ణయించనివ్వండి. మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.
మరోవైపు, టిఎంసి ఈ ఆరోపణలను ఖండించింది, అలాగే రథ్ హత్యను తీవ్రంగా గర్హించింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో హింసకు, రాజకీయ హత్యలకు ఎటువంటి స్థానం లేదని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. చంద్రనాథ్ రథ్ దారుణ హత్యతో పాటు మరో ముగ్గురు టీఎంసీ కార్యకర్తల హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, దర్యాప్తు ప్రారంభమైంది మరియు సోదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు భారత వైమానిక దళంలో పనిచేసిన రథ్, అధికారికి అత్యంత సన్నిహితులలో ఒకరు. పూర్వ మేదినీపూర్‌లోని చండీపూర్‌కు చెందిన ఆయన, చండీపూర్ పంచాయతీ సభ్యుడు హసీ రథ్ కుమారుడు. రథ్ 2018 నుంచి అధికారితోనే ఉన్నారు.
అధికారి బీజేపీలో చేరినప్పుడు, ఆయన రథ్‌ను తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. అధికారి ప్రతిపక్ష నాయకుడయ్యాక, రథ్ ఆయనకు కార్యనిర్వాహక సహాయకుడిగా మారారు.

More Stories
అస్సాం, బెంగాల్ ల్లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరూ ముస్లింలే!
ఎన్నికల అనంతరం హింసలో 200 ఎఫ్ఐఆర్ లు, అదుపులో 1500 మంది
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో రాజకీయ అనిశ్చితి