భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ తెలిపారు. సంతకం చేయడానికి ఇరు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మిగిలింది ఒక్క చివరి అడ్డంకి మాత్రమే అని పేర్కొన్నారు. “ఇప్పటికే చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నా. మేం చాలా దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నా. కానీ మనం చివరి అడ్డంకిని అధిగమించాలి. అంతేకాకుండా అజెండాలోని ఇతర ముఖ్య అంశాలపై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
అయితే అది ఎప్పుడు జరుగుతుందనే దానిపై అందించడానికి తన వద్ద పెద్దగా అంతర్గత సమాచారం ఏమీ లేదని చెప్పారు. కానీ మనం చాలా చాలా దగ్గరగా ఉన్నామని నేను నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఇటీవల చేసిన భారత్ పర్యటన గురించి లాండౌ గుర్తు చేసుకుంటూ భారత్ ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతోందని అనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
“ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. అంతేకాకుండా భారత్‌కు ఆర్థికంగా అద్భుతమైన అపార అవకాశాలు ఉన్నాయి. గతంలో తీసుకున్న ఆర్థిక విధానాల కారణంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కానీ ఇప్పుడు భారీ ఆర్థిక వృద్ధికి భారత్ సిద్ధంగా ఉంది. తద్వారా కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నా” అని లాండౌ వ్యాఖ్యానించారు.
భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఈ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఇరు దేశాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 7న దాని పాఠ్యాన్ని విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా భారత్‌పై విధించిన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఉన్న 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం. మిగిలిన సుంకాలను కూడా 18 శాతానికి తగ్గించేందుకు ప్రణాళిక ఉంది.
కాగా, వాణిజ్య ఒప్పందంపై ఏప్రిల్ 20 నుంచి 22 వరకు వాషింగ్టన్ డీసీ వేదికగా భారత్, అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చలతో ముడిపడిన అంశాలపై అమెరికా సీనియర్ అధికారి ఒకరు వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశగా భారత్, అమెరికాలు పురోగతిని సాధించాయని వెల్లడించారు. ఇరుదేశాల ప్రతినిధులు సానుకూల వాతావరణంలో, ఫలవంతంగా చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

More Stories
పాక్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న అమెరికా- ఇరాన్ యుద్ధం!
స్టాక్ మార్కెట్లలో ఎన్నికల ఫలితాల జోష్
30 శాతం లాభాలొస్తున్నా పెట్టుబడులు పెట్టని ప్రైవేట్ రంగం