ట్రంప్ కు `అసాధ్యమైన ఆపరేషన్’ లేదా `ఇరాన్ తో రాజీ’ మాత్రమే!

ట్రంప్ కు `అసాధ్యమైన ఆపరేషన్’ లేదా `ఇరాన్ తో రాజీ’ మాత్రమే!
ఇరాన్‌ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు చాలా పరిమితమైన, క్లిష్టమైన దారులు ఉన్నాయని పేర్కొంటూ టెహ్రాన్‌తో ‘అసాధ్యమైన ఆపరేషన్’ లేదా ‘చెడ్డ ఒప్పందం’ (రాజీ) అనే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది.  మరోవంక, మధ్యప్రాచ్యనికి అమెరికా సైనిక విమానాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. రవాణా, గగనతల ఇంధన సరఫరా విమానాలు అసాధారణంగా అధిక సంఖ్యలో తరలివచ్చాయి.
 
“దిగ్బంధనానికి వ్యతిరేకంగా పెంటగాన్‌కు ఇరాన్ ఇచ్చిన అల్టిమేటం, వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా చైనా, రష్యా, ఐరోపా వైఖరిలో మార్పు, కాంగ్రెస్‌కు ట్రంప్ రాసిన నిష్క్రియాత్మక లేఖ, ఇరాన్ చర్చల షరతులను అంగీకరించడం – వీటన్నింటికీ ఒకే అర్థం ఉంది: ట్రంప్ ఒక అసాధ్యమైన ఆపరేషన్ లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒక చెడ్డ ఒప్పందం మధ్య ఎంచుకోవాలి,” అని ఐఆర్‌జిసి ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
 
“అమెరికా సొంతంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం సన్నగిల్లింది” అని కూడా స్పష్టం చేసింది.  అమెరికా ఇరాన్ ఓడరేవులపై నావికా దిగ్బంధనాన్ని విధించగా, ఇరాన్ కీలకమైన హోర్ముజ్ జలసంధిని చాలా వరకు మూసి ఉంచడంతో అప్పటి నుండి చర్చలు నిలిచిపోయాయి.ఇదే సమయంలో, యుద్ధాన్ని ముగించేందుకు 14 పాయింట్లతో ఇరాన్‌ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్‌ ద్వారా దీన్ని అమెరికాకు అందజేసింది. లెబనాన్‌సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని కోరింది.
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును తిరస్కరించింది. 30 రోజుల్లోగా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేలా పరిష్కారాన్ని కోరింది.  తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, తమపై మళ్లీ దాడి చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, హొర్ముజ్‌ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆ ప్రతిపాదనల్లో కోరింది.

ఇరాన్‌ దురుసుగా ప్రవర్తిస్తే సైనిక దాడులను తాము పునఃప్రారంభించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ 14 అంశాల శాంతి ప్రతిపాదన సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఇరాన్‌ నాయకత్వంపై అనిశ్చిత స్థితి ఉన్నప్పటికీ ఆ దేశంతో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్‌ చెప్పారు.  మరోవంక, ఫ్లైట్‌రాడార్24 ఫ్లైట్-ట్రాకింగ్ డేటాను ఉపయోగించి జరిపిన పరిశీలనలో, మే 2న ఐరోపా నుండి మధ్యప్రాచ్య దేశాలకు ప్రయాణించే యు.ఎస్. సైనిక విమానాల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు కనుగొన్నారు. దీనికి ప్రధాన కారణం రవాణా, గగనతల ఇంధన సరఫరా విమానాలు. 

ఐరోపా, మధ్యప్రాచ్య గగనతలంలో కనిపించిన విమానాలలో, ఒక్కొక్కటి సుమారు 77 టన్నుల సరుకును, దాదాపు 100 మంది సిబ్బందిని మోయగల సామర్థ్యం ఉన్న సి-17ఏ గ్లోబ్‌మాస్టర్ III సైనిక కార్గో విమానాలు, అలాగే సుమారు 127 టన్నుల పేలోడ్ సామర్థ్యం గల లాక్‌హీడ్ సి-5ఎం సూపర్ గెలాక్సీ రవాణా విమానాలు, గగనతల ఇంధన నింపుదల, వ్యూహాత్మక రవాణా కోసం ఉపయోగించే బోయింగ్ కేసీ-46 పెగాసస్ ట్యాంకర్ విమానాలు ఉన్నాయి. 
 
కనీసం 12 రవాణా విమానాలు మధ్యప్రాచ్యానికి వెళ్తున్నట్లు సమాచారం. వాటిలో కొన్ని జర్మనీ నుండి బయలుదేరాయి. ఇజ్రాయెల్, సమీప ప్రాంతాలలో కనీసం నాలుగు బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన నింపే విమానాలు కూడా తిరుగుతూ కనిపించాయి. అమెరికాకు చెందిన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ నిఘా విమానం, బోయింగ్ ఆర్‌సీ-135డబ్ల్యూ రివెట్ జాయింట్, బహ్రెయిన్ సమీపంలో తిరుగుతూ కనిపించింది. అమెరికా నుండి బయలుదేరుతున్న కొన్ని రవాణా విమానాలు వాటి గమ్యస్థానాలు నిర్ధారించబడకుండానే కనిపించాయి.