గుజరాత్ మున్సిపోల్స్‌లో బిజెపి క్లీన్‌స్వీప్

గుజరాత్ మున్సిపోల్స్‌లో బిజెపి క్లీన్‌స్వీప్
2026 గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నికల విజయాల చరిత్రను పునరావృతం చేసింది, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఈ పార్టీ మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవడంతో పాటు, జిల్లా, తాలూకా పంచాయతీలలో గణనీయమైన ఆధిక్యాన్ని సాధించింది. 
 
తాజా గణాంకాల ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీలలో పోటీ చేసిన 9,200 స్థానాలకు గాను బీజేపీ కనీసం 6,450 స్థానాలను గెలుచుకుంది. ఏప్రిల్ 26న 9,200 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, ఇందులో 4.18 కోట్లకు పైగా అర్హతగల ఓటర్లు పాల్గొనగా, 55.1% ఓటింగ్ నమోదైంది.
మోర్బీ, పోరుబందర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్క స్థానం కూడా విపక్షాలకు దక్కకుండా వాటిల్లోని 52 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది.
గుజరాత్‌లోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన అహ్మదాబాద్, 48 వార్డులలోని 192 స్థానాలకు గాను 160 స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో, ఆ పార్టీ తన నియంత్రణలోనే కొనసాగింది. ఏఐఎంఐఎం ఏడు స్థానాలను, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని కోల్పోవడం వల్ల, కాంగ్రెస్ తన మొత్తం స్థానాలను 32కి పెంచుకుంది. ఇది 2021 కంటే ఎనిమిది ఎక్కువ.
 
రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇటీవల 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండింటి కాలపరిమితి ఇంకా పూర్తి కావాల్సి ఉంది.  తాజా ఫలితాల్లో అధికార బిజెపి ఆహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, గాంధీదామ్, సురేంద్రనగర్, మెహ్‌సానా, ఆనంద్, నదియాద్, నవ్‌సారి, వాపి కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. 
 
సూరత్ 120కి బిజెపి 115 గెలుచుకోగా, కాంగ్రెస్ ఒకటి, ఆప్ నాలుగింట విజయం సాధించాయి. రాజ్‌కోట్‌లో 72 స్థానాలకు గాను బిజెపి 65 ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఏడింట గెలిచింది.  15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలుకా పంచాయతీలకు గత ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహించారు.
2,030 స్థానాలున్న 84 మున్సిపాలిటీలలో, బీజేపీ 1,791 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 414 స్థానాలను, ఇతరులు 144 స్థానాలను కైవసం చేసుకున్నారు.
1,090 స్థానాలున్న 34 జిల్లా పంచాయతీలలో, బీజేపీ 568 స్థానాలను, కాంగ్రెస్ 77 స్థానాలను, ఇతరులు 30 స్థానాలను గెలుచుకున్నారు. 5,234 స్థానాలున్న 260 తాలూకా పంచాయతీలలో, బీజేపీ 2,397 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 591 సీట్లు కైవసం చేసుకోగా, ఇతరులు 329 సీట్లు గెలుచుకున్నారు.
 
గుజరాత్ ప్రజలు సుపరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల మరోసారి తమ విశ్వాసాన్ని చాటారాని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ విజయం వెనక కార్యకర్తల కృషి మరువలేనిదని చెబుతూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహా నగరపాలిక, నగరపాలిక, పంచాయతీల్లో గొప్ప విజయం ద్వారా బిజెపితో రాష్ట్ర ప్రజలకు ఉన్న గాఢమైన బంధం మరోసారి తేటతెల్లమైందని ప్రధాని చెప్పారు. బిజెపి పట్ల మరోసారి తమ నమ్మకాన్ని చూపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. 
 
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కొనియాడారు. ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో, “గుజరాత్ స్థానిక స్వపరిపాలన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఇచ్చిన అఖండ తీర్పు, రాష్ట్ర సేవ మరియు అభివృద్ధి విషయంలో బీజేపీపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసం చెక్కుచెదరకుండా పదిలంగా ఉందని తెలిపే స్పష్టమైన సంకేతం,” అని హోం మంత్రి షా తెలిపారు.