మరింతగా పెరిగిన ధనిక, పేద దేశాల మధ్య అంతరం 

మరింతగా పెరిగిన ధనిక, పేద దేశాల మధ్య అంతరం 
ధనిక, పేద దేశాల మధ్య అంతరం మరింతగా పెరుగుపోతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం అనేక దేశాలు అంగీకరించిన తీర్మానాలు అమలుకాలేదని, ముఖ్యంగా ప్రధాన ప్రపంచ ఆర్థిక సంస్థలను సంస్కరించడం, బలోపేతం వంటివి నెరవేరని వాగ్దానాలుగా మిగిలిపోయాయని  2030 నాటికి పేదలను అభివృద్ధి బాటలోకి తేవాలనే లక్ష్యాలతో 2015లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రూపొందించిందని నివేదిక పేర్కొంది. 
 
ట్రంప్‌ విధించిన సుంకాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల నుండి ఎగుమతులపై సగటు సుంకాలు 2025లో 9 శాతం నుండి 28 శాతంకి పెరిగాయని, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు, సగటు సుంకాలు 2శాతం నుండి 19శాతంకి పెరిగాయని నివేదిక తెలిపింది. 
 
నివేదిక విడుదల సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల అండర్‌ సెక్రటరీ జనరల్‌ లీ జున్‌హువా మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు ఆకర్షించడంలో ఎదురయ్యే ఇబ్బందులను మరింత పెంచుతున్నాయని తెలిపారు.  ”ఇది అంతర్జాతీయ సహకారానికి అత్యంత ప్రమాదకరమైన సమయం, ఎందుకంటే భౌగోళిక రాజకీయ , ఆర్థిక సంబంధాలు, ఆర్థిక విధానాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ, ఇరాన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత చీకటిమయం చేసిందని చెప్పారు.  2025లో 25 పేద దేశాలకు ధనిక దేశాలు అందించే సహాయాన్ని తగ్గించాయని, 2024 నుండి మొత్తం 23 శాతం క్షీణతకు దారితీసిందని, ఇది రికార్డు స్థాయిలో అతిపెద్ద తగ్గింపు అని లీ జున్‌హువా చెప్పారు. ముఖ్యంగా అమెరికా 59 శాతం నిధులను నిలిపేసిందని తెలిపారు. అయితే 2026లో 5.8 శాతం అదనంగా తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది.
 
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ మాట్లాడుతూ ఐఎంఎఫ్‌ ధనిక దేశాలకు ప్రయోజనం చేకూర్చిందని, పేద దేశాలకు కాదని, ప్రపంచ బ్యాంక్‌ తన లక్ష్యంలో విఫలమైందని, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో డజన్ల కొద్దీ దేశాలను తీవ్ర రుణభారంలో ముంచెత్తిందన్నారు. ఆర్థిక సంస్థలు నిర్ణయం తీసుకోవడంలో అమెరికా, దాని యూరోపియన్‌ మిత్రదేశాలు ఆధిపత్యం చెలాయించాయని, దాంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు నిరాశ చెందాయని తెలిపారు.
పేద దేశాలకు మేలు చేసేలా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లలో సంస్కరణలు చేయాలని గతంలో చాలాసార్లు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గళమెత్తారు. ధనిక దేశాలకే మేలుచేసేలా ఐఎంఎఫ్ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ప్రపంచ బ్యాంకు తన అసలైన మిషన్ నుంచి గాడి తప్పిందని తెలిపారు.