దేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కేవలం పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం కాదని, దీనిలో న్యాయ వ్యవస్థ నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. బార్ అసోసియేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం జరిగిన రూల్ ఆఫ్ లా కన్వెన్షన్ 2026లో `లీగల్ రిఫార్మ్ రోడ్‌మ్యాప్ టు ఎ యూఎస్డీ 10 ట్రిలియన్ భారత్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
త్వరితగతిన లాభాలు ఆర్జించే పెట్టుబడులు కాకుండా, దీర్ఘకాలికంగా నిలిచి, నమ్మకంపై ఆధారపడిన పెట్టుబడులు ఇప్పుడు భారతదేశానికి అవసరమని సీజేఐ తెలిపారు. ఉదాహరణకు, పెన్షన్ ఫండ్ డబ్బును మౌలిక సదుపాయాలలో పెట్టుబడిగా పెట్టడం, టెక్ కంపెనీలు తమ పరిజ్ఞానాన్ని పంచుకోవడం, లేదా పెద్ద విదేశీ కంపెనీలు సరఫరా గొలుసులను నిర్మించడం వంటివి దీర్ఘకాలిక నిబద్ధతలేనని ఆయన తెలిపారు.
దీర్ఘకాలిక పెట్టుబడులు దేశంలోకి రావాలంటే పెట్టుబడిదారులకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. “ఇన్వెస్టర్లు తమ డబ్బును పెట్టేటప్పుడు కేవలం ఒప్పందం అమలవుతుందా లేదా అన్నదే కాదు, ఆ ఒప్పందం కాలపరిమితి మొత్తం న్యాయపరంగా సురక్షితంగా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలిస్తారు” అని ఆయన గుర్తు చేశారు.
అంటే, న్యాయవ్యవస్థ స్థిరత్వం, పారదర్శకత, నిష్పాక్షికత పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధానంగా నిలుస్తాయని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలలో కమర్షియల్ వివాదాల స్వభావం పూర్తిగా మారిపోయిందని సీజేఐ చెప్పారు. ముందు చెల్లింపులు చేయకపోవడం, ఒప్పంద ఉల్లంఘనలు వంటి సులభమైన అంశాలపై వివాదాలు ఉండేవని తెలిపారు.
అయితే, ఇప్పుడు అవి సంక్లిష్టమైన వ్యాపార సంబంధాలపై ఆధారపడి ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక ఒప్పందాలు, మల్టీనేషనల్ భాగస్వామ్యాలు పెరగడంతో వివాదాల స్వభావం కూడా క్లిష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కమర్షియల్ చట్టాలు దేశానికి ఉపయోగపడుతున్నప్పటికీ, అవి కాలానుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
“చట్టాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. కానీ అది సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన సమయం మాత్రమే కాకుండా, మొత్తం సంబంధం కొనసాగుతున్న కాలంలో న్యాయం నిలబడేలా చట్టాలు ఉండాలని సూచించారు.
దేశ ఆర్థికాభివృద్ధికి మూడు ముఖ్య అంశాలు అవసరమని సీజేఐ వివరించారు. మొదటిది “ప్రెడిక్టబిలిటీ”— ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారినా, చట్టం అమలు ఒకే విధంగా ఉండాలి. రెండోది వివాదాలను ముందుగానే నివారించే సంస్కృతి. అంటే, చిన్న సమస్యలను పెద్ద కోర్టు కేసులుగా మార్చకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలి. లిటిగేషన్ మొదటి ఎంపిక కాకూడదు, చివరి మార్గంగా ఉండాలి” అని ఆయన వివరించారు.
మూడో అంశం “స్పెషలైజేషన్” ప్రస్తుతం వ్యాపార రంగంలో వచ్చే వివాదాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి ప్రత్యేక రంగాలకు సంబంధించినవిగా ఉంటున్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక నైపుణ్యం అవసరమని చెప్పారు. అందుకు న్యాయవాదులు మాత్రమే కాకుండా న్యాయమూర్తులు కూడా కాలానుగుణంగా శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు.
న్యాయ విద్యలో కూడా సంస్కరణలు అవసరమని చెబుతూ భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యార్థులను తయారు చేయాలని, వారు కొత్త రకాల కమర్షియల్ సమస్యలను అర్థం చేసుకునేలా కోర్సులు ఉండాలని చెప్పారు. అలాగే, న్యాయవ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కీలకమని స్పష్టం చేస్తూ డిజిటల్ కేస్ మేనేజ్మెంట్, ఏఐ ఆధారిత పరిశోధన సాధనాలు, ఈ-ఫైలింగ్ వంటి వ్యవస్థలు న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తాయని తెలిపారు. అయితే, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, తుది నిర్ణయంలో మానవ తీర్పు ముఖ్యమని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయానికి అడ్డంకులైన ప్రతి అనవసర అంశాన్ని తొలగించడమే లక్ష్యమని చెప్పారు.

More Stories
అంతరిక్ష పోటీలో రష్యా వెనకడుగు.. చంద్రయానం మరోసారి వాయిదా
తరతరాలుగా స్ఫూర్తిని అందిస్తున్న ఓ పవిత్ర భూమి కందకుర్తి
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం