‘సీసీటీవీ’లతో సైనికుల కదలికలపై నిఘా పెట్టిన ఉగ్రముఠా

‘సీసీటీవీ’లతో సైనికుల కదలికలపై నిఘా పెట్టిన ఉగ్రముఠా

* పాక్ గూఢచార మాడ్యూల్ గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు 

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న 11 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కనుసన్నల్లో ఈ ముఠా పని చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ముఠా ప్రధానంగా గూఢచర్యం, ఆయుధాల అక్రమ రవాణా, సైనిక స్థావరాలపై రహస్య పరిశీలన వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉందని అధికారులు తెలిపారు.  వీరు నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ)కు  చెందిన వారుగా గుర్తించారు. 

ఈ ముఠా సైనిక స్థావరాల కదలికలను కనిపెట్టడానికి సోలార్‌ పవర్‌తో నడిచే సీసీటీవీ కెమెరాలను రహస్యంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల వద్ద సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇప్పటివరకు దాదాపు 9 కెమెరాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కెమెరాలు మొబైల్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లకు లైవ్ వీడియో పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫేక్ ఐడీలతో సిమ్ కార్డులు తీసుకుని ఈ వ్యవస్థను నిర్వహించినట్లు తెలిసింది. ఈ ముఠా పంజాబ్‌లోని జలంధర్, పఠాన్‌కోట్, కపూర్తల, పాటియాలా, మోగా, హరియాణాలో అంబాలా, జమ్ముకశ్మీర్‌లో కథువా, రాజస్థాన్‌లో బికానేర్, అల్వార్ వంటి ప్రాంతాల్లో కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. 

ఈ ప్రాంతాల్లో సైనిక దళాల రాకపోకలు ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్లే ముఠా వాటిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఉగ్రముఠాను రెండు ఆపరేషన్లో చేధించారు. స్పెషల్ సెల్ నార్త్ రేంజ్ బృందాల నేతృత్వంలో జరిగిన మొదటి ఆపరేషన్లో పంజాబ్, ఢిల్లీకి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరివద్ద నుంచి 9 సీసీ కెమెరాలు, 4 తుపాకులు, 24 కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు సౌత్ వెస్ట్ రేంజ్ నిర్వహించిన రెండో ఆపరేషన్లో పంజాబ్‌లో మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బుతో తమను ఈ నెట్వర్క్ లోకి  ఆకర్షింపజేశారని నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా,  పంజాబ్ లోని తార్న్ తారన్‌కు చెందిన మన్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మన్ప్రీత్ పాక్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ ఆయుధాల సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థను సమన్వయం చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.

దీర్ఘకాలిక గూఢచార కార్యకలాపాలను కొనసాగించడానికి స్థానిక యువతను నియమించుకోవడం, వారితో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి బాధ్యతలను కూడా ఈ మాడ్యూల్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొందరు ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించడం, సరిహద్దు అవతల ఉన్న హ్యాండ్లర్లతో ఫొటోలు, వీడియోలను పంచుకోవడంలో ఈ ముఠా ప్రధాన పాత్ర పోషిస్తునట్లు గుర్తించారు. 

ఈ క్రమంలో అన్మోల్ అనే నిందితుడు తన సహచరుడు సాహిల్, పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయ్యింది. వీటితో పాటు పోలీసుల దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మాడ్యూల్ భద్రతా స్థావరాలపై గ్రెనేడ్లతో దాడులు చేయాలని కూడా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. 

అయితే, ఈ అరెస్టులతో పెద్ద ఉగ్రదాడిని ముందుగానే అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. కాగా, సీసీటీవీ డేటా, మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషిస్తూ మరిన్ని లింకులు వెలికితీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.