ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి సమక్షంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎస్‌ఎస్‌సిటియు(సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్శిటి)లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్న్‌షిప్, వర్క్‌షాపు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు.
అలాగే ఎస్‌ఎస్‌సిటియు అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళుకువలు పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సిటియులో సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ లో బీఎస్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్‌లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు.
ఈ కోర్సులను బోధించే ఎస్‌ఎస్‌సిటియు అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రాంతీయ విద్యా అభివృద్ధికి దోహదం చేయనుంది.
ఈ రెండు సంస్థల సహకారంతో ప్రారంభ దశలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో ఒక అత్యుత్తమ విద్యాసంస్థగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమం, వారి సంస్కృతి పరిరక్షణ, ఉన్నత విద్యా అవకాశాల విస్తరణ, సాంకేతిక విద్యాభివృద్ధి వంటి రంగాల్లో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని, దీని ద్వారా గిరిజన యువతలో కొత్త ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు.

More Stories
మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు
డీజీపీ ఎదుట మరో 42 మంది మావోయిస్టులు లొంగుబాటు
వర్దన్నపేటలో యువతిపై మృగాళ్ల గ్యాంగ్ రేప్ దారుణం