బెంగాల్ లో తొలగించిన ఓటర్లలో 63% మంది హిందువులే 

బెంగాల్ లో తొలగించిన ఓటర్లలో 63% మంది హిందువులే 
పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా తొలగింపునకు గురయ్యారు. వారిలో 63% మంది హిందువులు, 34% మంది ముస్లిములు ఉన్నారు. మతువా జనాభా అధికంగా కలిగిన సరిహద్దు నియోజకవర్గాల్లో హిందువుల పేర్ల తొలగింపు రేటు అధికంగా ఉన్నాయి.  ఓటర్ల ప్రత్యేక సమగ్ర జాబితా (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు ముందు, తర్వాత బూత్‌ స్థాయి గణాంకాలను పోల్చి చూస్తే, తొలగింపునకు గురైన ఓటర్లలో 57.47 లక్షల మంది (63%) హిందువులు కాగా, 31.1 లక్షల మంది (34%) ముస్లిములు ఉన్నట్లు తేలింది. 
సంఖ్యాపరంగా చూస్తే, అత్యధిక సంఖ్యలో పేర్లు హిందువులవే తొలగించారు.  తొలగింపులకు సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో హిందువుల పేర్ల తొలగింపు రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ నియోజకవర్గాల్లోని ఓటర్లలో అత్యధికులు ‘మతువా’ వర్గానికి చెందినవారే. ఈ మతువాలు బంగ్లాదేశ్‌ నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన హిందువులలో ఒక దళిత వర్గానికి చెందినవారు. 

పౌరసత్వ సవరణ చట్టం కింద వీరికి పౌరసత్వం ఇస్తామని బిజెపి హామీ ఇస్తోంది. ఉదాహరణకు, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దా అసెంబ్లీ స్థానంలో 50,230 మంది ఓటర్లను తొలగించారు, వీరిలో 46,826 మంది హిందువులు, 3,264 మంది ముస్లిములు ఉన్నారు. అదే జిల్లాలోని బోంగావ్‌ ఉత్తర్‌ అసెంబ్లీ స్థానంలో 42,164 మంది ఓటర్లను తొలగించారు, వీరిలో 37,101 మంది హిందువులు, 4,310 మంది ముస్లింలు ఉన్నారు. 

భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,987 మందిని తొలగించారు, వీరిలో 37,227 మంది హిందువులు, 12,084 మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో, తొలగించిన వారిలో దాదాపు 90% మంది హిందువులే ఉన్నారు.  ఝార్గ్రామ్‌లో, ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన వారిలో సుమారు 94% మంది హిందువులే. బంకురాలో తొలగించబడిన వారిలో 91%, అలాగే పురూలియాలో కూడా 88% మంది హిందువులే ఉన్నారు.

ఫిబ్రవరి 28న ఇసిఐ ప్రచురించిన ముసాయిదా జాబితాల నుండి 63 లక్షల మంది ఓటర్లను తొలగించగా, మరో 60 లక్షల మంది న్యాయాధికారుల విచారణను ఎదుర్కొన్నారు.  వీరిలో, ఏప్రిల్‌ 6న 27 లక్షల మంది ఓటర్లను తొలగించడంతో, మొత్తం తొలగింపుల సంఖ్య 90 లక్షలకు పైగా చేరింది. విచారణ ప్రక్రియలో  రాష్ట్రంలో అత్యధిక శాతం ముస్లిములు ఉన్న జిల్లా అయిన ముర్షిదాబాద్‌లోనే, ఓటర్ల తొలగింపులు కూడా అత్యధికంగా నమోదయ్యాయి.

న్యాయ సమీక్షకు వెళ్లిన 11.01 లక్షల పేర్ల నుండి 4.55 లక్షలకు పైగా పేర్లను తొలగించారు. ఉత్తర 24 పరగణాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 3.25 లక్షల మంది ఓటర్లు తొలగించగా, ఆ తర్వాతి స్థానంలో ముస్లిములు అధికంగా ఉన్న మరో జిల్లా అయిన మాల్దాలో 2.39 లక్షల మంది ఓటర్లు తొలగించారు. పరిశీలన సమయంలో తొలగింపునకు ఓటర్ల పరంగా చూస్తే, భవానిపూర్‌, నందిగ్రామ్‌ వంటి నియోజకవర్గాలలో హిందువుల కంటే ముస్లిం ఓటర్ల తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి.

పోలింగ్‌ ప్రారంభం కావడానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల సంఖ్య 6.75 కోట్లుగా ఉంది. ఇది, అక్టోబర్‌ 2025లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కావడానికి ముందు ఓటర్ల జాబితాలో ఉన్న 7.66 కోట్ల ఓటర్ల కంటే, 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత పొందిన 7.34 కోట్ల ఓటర్ల కంటే గణనీయంగా తక్కువ.